సిగ్గులేని స్టార్స్‌

ఎవరు సినిమాలు వారివి..ఎవరి ప్రమోషన్లు వారివి..ఎవరి సరదాలు వారివి. రాష్ట్రం గురించి అస్సలు పట్టించుకోరూ..నోరు విప్పి మాట్లాడరు. ఎవరి రాజకీయ అజెండా వారిది. అందుకే ముఖాలకే కాదు ప్రజలకు మేకప్‌ వేసేస్తున్నారు. అటు పెద్ద హీరోల దగ్గర నుంచి ఇటు చిన్న హీరోల వరకూ అందరూ ఒక తాను ముక్కల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. నాలుగేళ్ల తరువాత కళ్లు తెరిచి ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే ముద్దు అంటూ ప్రజల నిరసన బట్టి వాయిస్‌ మార్చుకుంది టీడీపీ. అసలు నాలుగేళ్ల ముందే ప్రజల మనోభావాలకు టీడీపీ విలువ ఇచ్చి ఉంటే ఈ సమస్య అప్పుడే తేలేది. అప్పుడు ప్యాకేజీకి జై కొట్టడంతో ప్రత్యేక హోదాను కమలనాథులు అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు బీజేపీని కడిగేయండి...నిలదీయండి..అంటూ టీడీపీ నేతల మాటలకు విలువ లేకుండా పోయింది. 40 ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు తెలివి ఇంతేనా? అంటూ నెట్‌జన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే సినీ గ్లామర్‌ను ఎక్కువగా వినియోగించుకోవడంలో తెలుగుదేశంకు మించిన పార్టీ మరొకటి లేదు. సినీ తారలకు కూడా లోపాయకారిగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖులు ప్రత్యేక హోదాపై ఇంతవరకూ నోరు మెదపలేదు. దీనిపై తీవ్రంగా ప్రజలు పరిగణిస్తున్నారు. మీ సినిమాల కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మీకు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు సినీస్టార్లు వాళ్ల రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా ఐక్యంగా పోరాడటానికి సిద్ధపడతారు. ఇటీవల రైతుల సమస్యలపై కూడా ఐక్యంగానే కేంద్రం వద్దకు వెళ్లారు. జల్లికట్టులో వారు చూపిన స్ఫూర్తి పోరాటం ఎవరూ మర్చిపోరు. మన తెలుగు స్టార్లు దద్దమ్మల్లా ఎందుకు ఉండిపోతున్నారు. ఏం అసలు పౌరుషం లేదా? అసలు ఎందుకు చూడాలి మీ సినిమాలు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, చరణ్‌ తదితర నటులంతా ఎందుకు ముందుకు రావడం లేదు. కోట్లు పెట్టి సినిమా తీసి ఆ సినిమా పైరసీ అయితే ప్రెస్‌ మీట్లు పెట్టి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టే హీరోలు, నిర్మాతలు..ఆంధ్రాకు వెలకట్టలేని అన్యాయం జరిగితే మీకు కనిపించడం లేదా? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక ¬దాపై తెలుగు సీనీ హీరోలు స్పందించాలంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నా హీరోలంతా చీమకుట్టిన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజుల్లో సినీ హీరోలు నోరు తెరవాలని, లేకపోతే వారి సినిమాలను అడ్డుకుంటామని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరించారు.

Comments