ఇద్దరు మిత్రుల పయనమెటో..!

ఇప్పుడు తమిళనాడులో కప్పల తక్కెడ రాజకీయం నడుస్తున్నది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో దినకరన్‌ అమ్మ జయలలితకంటే అత్యధిక మెజార్టీతో గెలవటంతో జయలలిత వారసత్వ రాజకీయం మరింత జటిలమైంది. దీంతో అన్నాడీఎంకే భవిష్యత్‌ ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. అన్నాడీఎంకేను చింపిన విస్తరి చేయడం ద్వారా తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలనుకొని డీఎంకే తిరుగులేని ఎత్తుగడ వేసింది. తమ పార్టీ పత్రికకు ఆర్కే నగర్‌ బీట్‌ చూసే ఓ విలేఖరి (గణేశ్‌)కు టిక్కెట్‌ ఇవ్వటంతోనే డీఎంకే ఎత్తుగడ స్పష్టమైంది. ఆర్కేనగర్లో గతంలో జయలలితపై పోటీ చేసిన అభ్యర్థిని కూడా కాదని ఒక డవ్మిూ అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా దినకరన్‌ గెలుపునకు ఒక విధంగా బాహాటంగానే తోడ్పాటునందించింది. దినకరన్‌ గెలిస్తే అధికార పార్టీలు లుకలుకలు మొదలవుతాయన్నది ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. డీఎంకే వర్కింగ్‌ ప్రసిడెంట్‌ పైకి రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ అన్నాడీఎంకేను ముక్కలు చేయటమే ఆయన తక్షణ రాజకీయ ప్రయోజనం. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సరిగ్గా ఆ దిశగానే అన్నాడిఎంకేలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ వేగంగా మారుతున్నాయి. 
ఇంతకాలం గోడవిూద పిల్లుల్లా వ్యవహరించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు దినకరన్‌ ఇంటికి రాకపోకలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం యమ అర్జెంట్‌ గా విూటింగ్‌ పెట్టి.. ఆరుగురు రెబల్‌ నేతలపై సస్పెన్షన్‌ వేటు కూడా వేసేశారు. అటు 2జీ స్పెక్ట్రం కేసులో తమకు అనుకూలంగా తీర్పురావడం సమయానుకూలంగా కలిసివచ్చిన అంశమైంది. జయలలిత మరణానంతరం అప్పటిదాకా పెండింగ్‌ లో ఉన్న అక్రమాస్తుల కేసులో తీర్పువచ్చేలా చేసి శశికళను జైలుకు పంపించడం ద్వారా అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకొని తమిళనాడులో పాగా వేయొచ్చని బీజేపీ వేసిన పన్నాగం ఫలించకపోగా తాజా ఉప ఎన్నికలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని పరువు పోగొట్టుకొన్నది. ఇప్పుడు ఏరకంగా చూసినా డీఎంకేదే తమిళనాడు రాజకీయాల్లో పైచేయిగా సాగుతున్నది. రెండేళ్ల క్రితం వరకు తమిళనాడులో రాజకీయం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత పగ, ద్వేషంగానే కొనసాగాయి. ఓ పక్క పురచ్చితలైవి జయలలిత, మరోపక్క కలైంజర్‌ కరుణానిధి అంతులేని కార్పణ్యాలతో తమిళనాడు రాజకీయాలను నడిపించారు. రాష్ట్రాన్ని చెరో అయిదేళ్లు పాలిస్తూ తమిళనాటే కాకుండా సంకీర్ణ రాజకీయాల శకంలో జాతీయ రాజకీయాలను పరోక్షంగా శాసించారు. 
జాతీయ పార్టీలు ఇంతకాలం తమిళనాడు వైపు కన్నెత్తయినా చూసేందుకు సాహసం చేయలేదు. ఆమె (జయలలిత) అధికారంలో ఉన్నప్పుడు ఆయన (కరుణానిధి) పై కేసులు పెట్టడం.. ఈడ్చుకెళ్లి జైల్లో పడేయటం.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆమెపై కేసులు పెట్టి వేధించడం కామన్‌ అయిపోయింది. ఇప్పుడు కరుణానిధి కురువృద్ధుడై ఇంటికే పరిమితమయ్యారు. జయలలిత మరణించి ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో జరుగుతున్న పరిణామాలు తమిళ రాజకీయాల్లో కచ్చితంగా కొత్త సవిూకరణాలకు సంకేతాలనందిస్తున్నది. జయ మరణం తరువాత ఆమె మేనకోడలు నిన్న మొన్నటి వరకు తెగ హడావుడి చేసింది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కృతితో ఇక ఆమె చాప్టర్‌ ముగిసినట్టే. ఇదే ఎన్నికల్లో హీరో విశాల్‌ సడన్‌ గా సీన్‌ లోకి వచ్చి నామినేషన్‌ వేశాడు. కానీ అతని నామినేషన్‌ కూడా చెల్లలేదు. అంతకు ముందు అగ్రనటుడు కమల్‌ హసన్‌ రాజకీయాల్లో ప్రవేశంపై బ్రహ్మాండంగా మార్కెటింగ్‌ చేసుకొన్నారు. కేరళ వెళ్లి ముఖ్యమంత్రి విజయన్‌ ను కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో మాటామంతీ నెరిపారు. డీఎంకే వేదికపై ముఖ్య అతిథిగా కుర్చీ పంచుకొన్నారు. 
లౌకికవాదం లాంటి రాజకీయ సిద్ధాంతాలను వల్లెవేశారు. పుట్టినరోజునాడు పార్టీ సంగతి తేలుస్తానన్నారు. పుట్టిన రోజు వచ్చేసరికి పార్టీ పెట్టడం ఖాయమే కానీ.. పక్కా ప్రణాళిక రచించుకొని సీన్లోకి వస్తానని చెప్పారు. కమల్‌ హసన్‌ రాజకీయాల్లోకి వస్తాననుకొన్నప్పుడు.. వెంటనే వచ్చిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను అవకాశంగా మలుచుకోవలసి ఉండేది. కానీ, ఆయన ఆ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు. కనీసం ఏ ఒక్క అభ్యర్థినైనా సమర్థిస్తున్నట్టు చెప్పలేదు. అసలు ఉప ఎన్నికను కమల్‌ హసన్‌ పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి కమల్‌ రాజకీయ రంగు వేసుకొనే అవకాశం ఉన్నది. ఈ ఏడాదిలోనే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నెమ్మది నెమ్మదిగా పావులు కదుపుతూ వచ్చారు. 2017లోనే ఆయన మూడు సార్లు అభిమానులతో సమావేశమయ్యారు. మంగళవారం (26 డిసెంబర్‌ 17) కూడా ఆయన మరోసారి అభిమానులను కలిశారు. ఈ మూడు సమావేశాల్లోనూ ఆయన తన రాజకీయ ప్రవేశంపై సూచన ప్రాయంగా మాట్లాడటమే తప్ప.. వస్తానని స్పష్టంగా చెప్పలేదు. పైగా దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పుకొచ్చారు. శంకర్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా ఆడియో ఆవిష్కరణలో రజిని భార్య ఐశ్వర్య తన భర్త రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందంటూ ఓ స్టేట్‌ మెంట్‌ కూడా ఇచ్చారు. తాజా సమావేశంలో రజిని తనకు రాజకీయాలు కొత్త కాదంటూ డిసెంబర్‌ 31న ప్రకటన చేస్తానంటూ అభిమానులను మళ్లీ సస్పెన్స్లో ఉంచినప్పటికీ.. రజినీ రాజకీయాల్లోకి రానున్నారన్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 
రజిని రాజకీయ ప్రవేశంపై చాలా సంవత్సరాలుగా ఊహాగానాలు వస్తున్నప్పటికీ.. కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజ నేతల శక్తిసామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసుకొన్నారు కాబట్టే తొందరపడలేదు. విజయ్‌ కాంత్‌ లాంటి వారు ధైర్యం చేసినప్పటికీ.. దాదాపు రెండు దశాబ్దాలు కష్టపడితే తప్ప కొన్ని సీట్లు గెలుచుకొనే స్థాయికి చేరుకోగలిగారు. ఇప్పుడు ఇద్దరు మహానేతల్లో జయలలిత కన్నుమూశారు. కరుణానిధి దాదాపుగా తెరమరుగయ్యారు. ఇప్పుడు మాస్‌ అప్పీల్‌ ఉన్న స్టార్‌ గా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సరైన సమయమని రజిని భావిస్తున్నారు. పైగా గత నాలుగైదేండ్లుగా ఆయనకు సరైన సినిమాల్లో పెద్దగా బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలు అంటూ కూడా ఏవిూ లేవు. కాబట్టి రజిని వ్యూహాత్మకంగానే రాజకీయం వైపు అడుగులు వేస్తున్నారు. డిసెంబర్‌ 31న రజిని రాజకీయ ప్రవేశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో మరో సినిమా తరం శకం ప్రారంభమవుతుంది. 
రజినీ సీన్లోకి ఎంటర్‌ అయితే డీఎంకే మాటెలా ఉన్నా, అన్నాడీఎంకే కేడర్‌ మొత్తం మారిపోయే అవకాశం ఉన్నది. ఒకవేళ కమల్‌ హసన్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టినట్టయితే అప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే రజినీతో పోలిస్తే కమల్‌ హసన్‌ ఆకర్షణ శక్తి ఎంతన్నది బరిలోకి దిగితే తప్ప అంచనా వేయలేం. రాష్ట్రంలో అత్యంత బలమైన శక్తిగా ఉన్న డీఎంకేను వీళ్లిద్దరూ ఏమేరకు ఎదుర్కొంటారన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం పడిపోకపోతే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నది. అప్పటికల్లా తమిళనాడులో రాజకీయాలు పదునెక్కుతాయి. అంతా అనుకున్నట్టుగా ఇద్దరు మహానటులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వాతావరణం మరింత రంజుగా మారుతాయి. రజినీ మరో ఎంజీఆర్‌ లా రూపాంతరం చెందగలరా? కమల్‌ మరో కరుణానిధిలా ప్రజల మన్ననలు పొందగలరా? వేచి చూడాలి.

Comments