దేవుడు కూడా జీఎస్టీ బాధితుడే

కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటారు. గుడికెళ్లి మొక్కులు సమర్పించుకుంటారు? మరి ఆ దేవుడే జీఎస్టీ నుంచి తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. భక్తుడైతే దేవుడికి మొరపెట్టుకుంటాడు? మరి ఆ దేవుడు ఎవరికి చెప్పుకోవాలి. ఇక గుడికి వెళితే భక్తులకు ప్రశాంతత ఏమో కానీ, పరేషాన్‌ తప్పేలా లేదు. దేవుడికి చెంతకు వెళ్తే ఇప్పుడు జేబునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల జేబును గుల్ల చేస్తూ వచ్చిపడ్డ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇప్పుడు దేవుడి సేవలను మరింత ప్రియం చేస్తోంది. అన్నింటికీ అతీతుడైన భగవంతుడిని కూడా జీఎస్టీతో మాత్రం వదిలేది లేదంటోంది కేంద్రం. ఇది గుడి పరిసరాల్లో అడుగుపెట్టిన నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంది. భక్తులు దిగే కాటేజ్‌ నుంచి స్వామివారి సేవలు, ప్రసాదాలు ఇలా ఏదీ మినహాయింపు కాదన్నమాట. 
ఇప్పుడు ఈ నిర్ణయంతో పన్ను భారం నేరుగా భక్తుడి జేబుకు చిల్లుపెట్టనుంది. ఇక స్వామి సన్నిధికి వెళ్లాలంటే జేబు నింపుకుంటే చాలని పరిస్థితి వస్తోంది. అష్టోత్తరం చేయించినా, హారతి సమర్పించినా ఆర్జిత సేవల రూపంలో జీఎస్టీ వడ్డించనుండగా..కల్యాణోత్సవాలు, వ్రతాలు.. ఇలా ఒక్కటేంటి ఆలయాల్లోని ఆర్జిత సేవలన్నింటిపై 18 శాతం మేర పన్ను చెల్లించాల్సిందే. ఇక అన్ని సేవలు అయిన తర్వాత ప్రశాంతంగా స్వామివారి ప్రసాదం కూడా తీసుకోలేని పరిస్థితి. ప్రసాద సరుకులు కొన్నప్పుడు మళ్లీ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇక రూ.1,000, అంతకంటే ఎక్కువ రుసుము ఉన్న కాటేజీలపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఈ మొత్తాన్ని ఆ దేవాలయం ఆదాయంలోంచి చెల్లించాల్సి వస్తోంది. ఈ భారాన్ని భక్తులపైనే వేస్తామని ప్రభుత్వానికి నివేదించి, అనుమతి పొంది ధరలు పెంచేస్తున్నాయి. జీఎస్టీ భారంతో ఇప్పటికే ప్రసాదాల ధరలు పెరగగా మరింత పెరగనున్నాయి. మరోవైపు జీఎస్టీ నుంచి ఆలయాలను మినహాయించాలని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments