బిట్‌ బుట్టలో పడొద్దు

ఆన్‌లైన్‌ బిట్‌కాయిన్‌ హడావుడి ఇంతాఅంతా కాదు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. బిట్‌కాయిన్‌ వంటి కల్పిత కరెన్సీతో కచ్చితంగా నష్టపోతారని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఇటువంటి పథకాలు పోంజీ స్కీమ్స్‌ వంటివని, వీటికి ఎటువంటి చట్టబద్ధత కాని, ఈ పెట్టుబడులకు రక్షణగానీ ఉండవని స్పష్టం చేసింది. అసలు 'పోంజీ పథకాల తీరులోనే, ఊహాజనిత కరెన్సీ విలువ కూడా హఠాత్తుగా తగ్గవచ్చని, దీనిలో పెట్టుబడిగా పెట్టిన నిధులు అకస్మాత్తుగా జారిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బిట్‌కాయిన్‌లపై ఎలాంటి పెట్టుబడులు నెట్‌ జనులు 
జాగ్రత్త పడాలని తెలిపింది. తొలుత ఈ పథకాలు ఆశాజనకంగా ఉన్నా..తెలియకుండానే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీసీలు డిజిటల్‌/ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే నిల్వ ఉంటాయి కనుక, హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. పాస్‌వర్డ్‌లు పోగొట్టుకున్నా కూడా ఎంతో ఇబ్బింది. మాల్‌వేర్‌ దాడులకూ అవకాశాలుంటాయి. ఇలా జరిగితే డబ్బు పూర్తిగా నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి' అని ఆర్థిక శాఖ వివరించింది. కాగా 'ఈ మధ్య బిట్‌కాయిన్‌ విలువ శరవేగంగా పెరుగడంతో, అంతర్జాతీయ మార్కెట్‌ తో పాటు దేశీయంగా కూడా పలువురు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. కానీ? వాటికి అంతర్గత విలువ ఏమీ లేదు, ఆ కరెన్సీకి ఆస్తులు కూడా ఏమీ లేవు. అంటే ఊహాగానాలతోనే వీసీల విలువ పెరుగుతుంది. అందువల్ల ధరల్లో అధిక ఒడుదుడుకులకు ఆస్కారం ఎక్కువ' అని స్పష్టం చేసింది. అంతే కాకుండా వీసీల లావాదేవీలు ఎన్‌క్రిప్షన్‌ పద్ధతిలో జరుగుతాయి కనుక, తీవ్రవాదులకు ఆర్థికసాయం, స్మగ్లింగ్‌, మాదకద్రవ్యాల సరఫరా, మనీ లాండరింగ్‌ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తారని కూడా వెల్లడించింది. అయితే బిట్‌కాయిన్‌, ఇతర కల్పిత కరెన్సీల నియంత్రణ, చట్టబద్ధతకు అంతర్జాతీయంగా ఏ నిబంధనలు పాటిస్తున్నారో పరిశీలనకు ఒక కమిటీని నియమించినట్లు ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి రాధాకృష్ణన్‌ లోక్‌సభలో ప్రకటించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వాటిపై చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా వీటిపై వచ్చే నష్టాలపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే మూడుసార్లు మదుపర్లను హెచ్చరికలు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. 
                                                                                                                              - పి.వేణుగోపాల్‌

Comments