బొమ్మ పడడం కష్టమే

శుక్రవారం నుంచి థియేటర్లు బంద్‌! మార్చి 2 నుంచి థియేటర్లు మూతపడనున్నాయ్‌!! ఆ మేరకు డిజిటల్‌ ప్రొవైడర్లపై యుద్ధానికి ఫైనల్‌ జేగంట మోగింది. తెలుగు ఫిలింఛాంబర్‌ .. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నిర్ణయాన్ని ఫైనల్‌ చేసిన సౌతిండియా ఫిలింఛాంబర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆ మేరకు ఓ ప్రకటనను వెలువరించింది. ఫిలింఛాంబర్‌ డిజిటల్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర ప్రసాద్‌, ముత్యాల రామదాసు నేడు పాత్రికేయ సమావేశంలో సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు దఫాలుగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (డీిఎస్‌పీ)లతో చర్చలు సాగాయి. రెండుసార్లు విఫలమయ్యాయి. క్యూబ్‌, యూఎఫ్‌వోల ఛార్జీలు తగ్గించేందుకు ససేమిరా అన్నారు. ''ఏం చేస్కుంటారో చేస్కోండి.. ఆల్‌ ది బెస్ట్‌'' అంటూ వెటకారం ఆడారని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు ఆవేదన చెందారు. ఓ రకంగా ధరల్లో చుక్కలు చూపిస్తున్న డిఎస్‌పీలు డైలాగులతోనూ చుక్కలు చూపించారని వాపోయారు. మార్చి 2 నుంచి థియేటర్ల బంద్‌ యథావిధిగా జరగనుంది. థియేటర్లు తిరిగి ఎప్పటికి తెరుచుకుంటాయో కూడా చెప్పలేమని అన్నారు. మొత్తానికి సైరన్‌ మోగింది. వినోదానికి పెద్ద పంచ్‌ పడనుంది. ఈ బంద్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుందో? ఎప్పటికి ఎత్తేస్తారో కూడా చెప్పలేని సన్నివేశం ఉందని చెబుతున్నారు. మార్చి 30న రంగస్థలం రిలీజ్‌ మొదలు, వరుసగా ఏప్రిల్‌, మే, జూన్‌ వరకూ అన్నీ భారీ చిత్రాల రిలీజ్‌లకు క్యూలో ఉన్నాయి. మరి మార్చిలోనే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుందా? లేక సుదీర్ఘ కాలం కొనసాగుతుందా? అన్నది అర్థం కాని పరిస్థితి.

Comments