ఇది నల్లని విజయం


మాకు అమ్మాయి పుట్టింది..పాప నల్లగా ఉందా? తెల్లాగా ఉందా?.. 
మా అబ్బాయికి సంబంధం కుదిరింది...అమ్మాయి ఎలా ఉంటుంది? నల్లగానా? తెల్లగానా??.. 
ఇలా పుట్టిన దగ్గర నుంచి అన్ని సందర్భాలలో అమ్మాయికి ముడిపెట్టే ఒకే ఒక కామన్‌ విషయం రంగు. పొరపాటున నల్లగా ఉందా ఇక అంతే .. ఆ అమ్మాయికి ఆ రంగే ఓ శాపంగా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఎన్ని తరాలు మారుతున్నా ఎంత విజ్ఞానం పెరుగుతున్నా..అమ్మాయి అందం నిర్వచించడంలో మన దేశంలో పెద్ద పీట వేసేది మాత్రం ఒంటి ఛాయకే. టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటనలలో సగం అమ్మాయిలు వాడే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌లు గురించే. అంటే ఒంటి రంగుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది. 
ఇలా వర్ణ వివక్షతను ఎదుర్కొన్న ఎంతోమంది అమ్మాయిలలో తన్యా నంభియార్‌ ఒకరు. ఇక్కడ మనం ఆ అమ్మయి గురించే ఎందుకు చెప్పుకుంటున్నామంటే తను కూడా నల్లగా ఉంటుంది కాబట్టి. మన సమాజం ఇచ్చిన ఎన్నో చేదు అనుభవాలనే మెట్లుగా మార్చుకుని ఎన్నో విజయాలను సాధిస్తూ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది ఢిల్లీకి చెందిన తన్యా నంభియార్‌. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే.. 
'చిన్నప్పుడు నాన్నమ్మ నన్ను టీ తాగనిచ్చేది కాదు. అది తాగితే ఇంకా నల్లగా అయిపోతావనేది. ఎక్కడకి వెళ్లినా బంధువులు, ఫ్రెండ్స్‌ తెల్లగా అవడానికి చిట్కాలు చెప్పేవారు. ఇది వాడు అది వాడు..ఇది తిను..అది తిను అని... స్కూల్‌లో జరిగే కల్చరల్‌ కార్యక్రమాలే కాకుండా ఎందులోనూ లీడ్‌ రోల్‌ ఇచ్చే వారు కాదు. ఎందుకంటే నేను అందంగా లేనని..రాధగా నటించాలని చాలా ఆశగా ఉండేది. కానీ నువ్వు నల్లగా ఉన్నావు..కదా..కృష్ణుడు వేషం వేస్తే బాగుంటుందని అనేవారు టీచర్లు. 
30 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాను. నన్ను చాలా మంది అడిగేవారు..నువ్వు మద్రాసివా అని. దక్షిణ భారత దేశ ప్రజలంతా నల్లగా ఉంటారని ఇక్కడి వాళ్ల విశ్వాసం. ఫెయిర్‌నెస్‌ ఫెషియల్‌ చేయించుకుంటారా అని బ్యుటీషియన్లు కూడా అడుగుతుంటారు. ఈ మధ్యే జరిగిన నా వివాహం సందర్భంలో నా ఛాయ గురించి జరిగిన చర్చలు చెప్పలేనవసరం లేదు. నేను తెల్లగా కనబడటం కోసం నా బ్యుటీషియన్‌, డ్రెస్‌ డిజైనర్‌ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. 
ఈ ఒంటి రంగు మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే మ్యాట్రిమోనియల్‌ ప్రకటనలలో అయితే ఫెయిర్‌ అండ్‌ బ్యూటిఫుల్‌కు ఉన్నంత ప్రాధాన్యత చదువు, వ్యక్తిత్వానికి ఇవ్వడం లేదు. అంటే ఇంకా 2017 దాటినా మన యంగ్‌ జనరేషన్‌ ఎంత అవివివేకంగా ఆలోచిస్తుందో తెలుస్తుంది. 
నా అదృష్టం ఏమిటంటే మా అమ్మకు ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకే చిన్నప్పటి నుంచి మన దగ్గర ఏముందో దాంతోనే సంతోషంగా ఉండడం అలవాటు చేసింది. అందుకే నేను ఎప్పుడూ తెల్లగా అవ్వాలని దేవుడ్ని కోరలేదు. ఏ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల వెంటపడలేదు. నాకు ఏం ఇష్టమో దానిపైనే దృష్టి పెట్టాను. అందుకే నేను ఈ రోజు ఓ గాయనిగా, వ్యాఖ్యాతగా, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోగలిగాను. నేను చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగం వదిలేస్తున్నప్పుడు చాలా మంది నాకు అడ్డు చెప్పారు. కానీ నాకు తెలుసు ఏ రంగంలో ఎదగగలనో. ఇప్పటి వరకూ నన్ను ఈ రంగంలో ఎవరూ నా రంగు గురించి కామెంట్‌ చేయలేదు. కానీ అప్పుడప్పుడు మోడలింగ్‌ చేయాల్సినప్పుడు మాత్రం నా రంగు వల్లే కొన్ని అవకాశాలు వెనక్కిపోయాయి కూడా. ఆ రంగంలో వాళ్లు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చేది రంగుకే కదా.. దానికి నేను ఏమాత్రం బాధపడను అని అంటోంది తన్యా నంభియార్‌. 
మనిషి అందం అనేది వారి ఒంటి రంగులో కాదు. వారి చేసే పనుల్లోనూ, ఆలోచనల్లో ఉంటుందనికనీసం ఈ జనరేషన్‌ అయినా తెలుసుకుంటుందని ఆశిద్దాం. 

                                                                  -సరితాసూర్యా, చెన్నై

Comments