పురిట్లోనే చంపేదాం అనుకున్నారు..కానీ విధి ఈర్ష్యపడేలా ఎదిగింది


పిల్లలు పుట్టగానే పండగ చేసుకుంటారు తల్లిదండుల్రు కాని ఆమె పుట్టగానే అలా ఎవరూ సంబరపడలేదు. వారికది మెదటి సంతానమే అయినా పుట్టిన పిల్ల పురిట్లోనే చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. నిజానికి అంత దారుణంగా ఆలోచించేంత కర్కసమైన మనుషులు కాదు వాళ్లు. కాని పుట్టిన ఆ అమ్మాయి జీవితం ఎంత దుర్భరంగా ఉండబోతోందో ఊహించుకుని అలా అనుకున్నారు... అలా బాధపడడానికి కారణం పుట్టిన బిడ్డకు రెండు చేతులు ఉండాల్సిన చోట మాంసపు ముద్దలు వేలాడుతూ కనిపించడమే. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు కాని లాభం లేదు. పాపం జీవితం ఎలారా దేవుడా అనుకుంటూ మదన పడ్డారు. కన్నపేగును కాపాడుకునేందుకు ఎంతో తాపత్రయపడ్డారు. ఫలితం లేదు. చేతులు లేకుండా జీవితమంతా ఎలా ? అనుకుంటూ అనుక్షణం వేదన భరించారు. కానీ అదే పాప ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఇంతకీ ఆ దివ్యాంగురాలు ఎవరు? ఆ కథేంటి...తెలుసుకుందామా... 
ఆ అమ్మాయి పేరే బసంతి కుమార్‌ జార్ఖాండ్‌లో పుట్టింది. ప్రస్తుతం సెకండ్రీ గ్రేడ్‌ స్కూల్‌ టీచర్‌గా పని చేస్తోంది. చాలా పేద కుటుంబంలో పుట్టిన బసంతికి నలుగురు చెల్లెళ్లు. తన తోటివాళ్లంతా స్కూలుకు వెళుతున్నా తనకు చేతులు లేవనే కారణంతో ఇంటికే పరిమితమైంది. అయితే ఇలా ఇంట్లో ఉండడం బసంతికి ఏమాత్రం ఇష్టం లేదు. అందరిలాగా స్కూల్‌కు వెళ్లాలని, బాగా చదువుకోవాలని అనుకునేది. చేతులు లేనందున రోజువారీ కార్యక్రమాలు కాళ్లతోనే చేసుకునేది. ఇదే ఆలోచన చదువులోనూ అమలు చేసింది. అంతే కాళ్లతో బలపం పట్టుకుని తన చదువుకు తనే అక్షరభ్యాసం చేసుకుంది. ఈమె పట్టుదల చూసి ఆ చదువుల తల్లీ మురిసిపోయింది. బలపం పట్టుకుని రాస్తూ తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. వాళ్లను ఒప్పించి ఆరేళ్ల వయసులో ఇంటినే బడి చేసుకుంది బసంతి. 
పట్టుదలతో చేతులు లేకపోతేనేం కాళ్లు ఉన్నాయి కదా అనే ధైర్యంతో ఇంట్లో కూర్చునే కాళ్లతో రాయడం పాక్ట్రీస్‌ చేసింది. ఆమె పట్టుదల చూసిన తల్లిదండుల్రు కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్‌లో చేర్పించారు. 1993లో పదో తరగతి పాస్‌ కావడం ఆ తర్వాత ఇంటర్‌ పాస్‌ అయ్యి, 1999 లో బీఏ చదువును కూడా పూర్తి చేసింది. 
ఇంతలోనే కుటుంబంలో ఓ కుదుపు. అల్లారుముద్దుగా చూసుకున్న తండ్రి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. చేతులు లేని బసంతికి ఆ విధి సైతం చేతులెత్తి మొక్కేంత ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండడంతో కుటుంబ భారాన్ని మోయడానికి సిద్ధమైంది. 
అయితే కష్టంలో ఉన్నప్పుడే మనల్ని పరిక్షించడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులే బసంతి కూడా ఎదుర్కొంది. ఎన్నో అవమానాలు..మరెన్నో చీదరింపులు...ఇవన్నీ భరించింది. ఎందుకంటే తనకు తెలుసు ఈ కష్టాలకే కన్నీళ్లు తెప్పిస్తానని.. అనుకున్నట్టే 2005లో రోరబంద్‌ కార్మిక్‌ మిడిల్‌ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం సంపాదించగలిగింది. 
ఉద్యోగంలో మరో టాస్క్‌ 
ఇక్కడే మరో ఛాలెంజ్‌ ఎదురయ్యింది బసంతికి... కూర్చుని కాళ్లతో పుస్తకంలో రాయడం వరకూ సరే కాని ఇప్పుడు ఆమో ఒక టీచర్‌గా నిలబడి కాలితో బ్లాక్‌ బోర్డ్‌పై రాయాలి. అయినా బసంతి వెనక్కి అడుగు వేయలేదు. శరీరాన్ని బ్యాలన్స్‌ చేస్తూ బ్లాక్‌బోర్డుపై కాలితో రాయడం పాక్ట్రీస్‌ చేసింది. గణితం, ఇంగ్లీష్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్ట్స్‌ను పిల్లలకు ఎంతో ఇష్టంగా భోదిస్తుంది. ఇలా ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా పాటించడమే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా తనే తీసుకుని ఇంటి పెద్దగా నిలబడింది. చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా నిలబడటమే కాదు ఈ సమాజంలో ఎంతోమందికి ఆదర్శ మహిళగా నిలబడింది. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దగా చూస్తూ తమ ఎదుగుదలకు అవే అవాంతరాలుగా సాకులు చెప్పుకునే చాలామందికి బసంతి కథ ఒక ఆదర్శంగా నిలబడుతోంది.

                                                         -సరితాసూర్యా, చెన్నై ప్రతినిధి

Comments