విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యబాబు ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. తేజ ఈ చిత్రానికి డైరెక్టర్. స్క్రిప్ట్ సిద్ధమైంది. కాస్టింగ్ కూడా దాదాపు ఫైనలైజ్ అయినట్టే. తాజాగా ఈ చిత్రంలో తారకరామారావు జీవిత భాగస్వామి, బాలకృష్ణ తల్లి బసవతారకం పాత్ర కోసం అందాల కథానాయిక, మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్‌ను సంప్రదించారట. అలాగే ఇందిరాగాంధీ పాత్ర కోసం అత్తారింటికి దారేది ఫేం నదియాను సంప్రదించినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ రెండు పాత్రలు ఈ చిత్రానికి కీలకం కానున్నట్టు సమాచారం. నిత్యా, నదియా ప్రతిభావణులు. ఆయా పాత్రలకు న్యాయం చేయగలరని తేజ అండ్ టీమ్ భావించి ఆఫర్ చేశారట. అయితే ఆ ఇద్దరూ ఓకే చేశారా లేదా? ఫైనల్ అయినట్టేనా? అన్నది తెలియాల్సి ఉందింకా. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతల్ని బాలయ్య నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. జనవరి 18న రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కు చక్కని స్పందన వచ్చింది.

Comments
Post a Comment