వీళ్లు కూడా జేబు దొంగల జాబితాయే..!

జేబు దొంగల ఫొటోలు పోలీస్‌స్టేషన్లలో పెడతారు. రైళ్లలో దోపిడీలు చేసేవారి చిత్రాలు ప్రతి స్టేషన్‌లోనూ అతికిస్తారు. కానీ కోట్లకు కోట్లు కొట్టేసేవారి పేర్లను సైతం బయటపెట్టేందుకు ఎందుకో ముందుకు రారు. 
బ్యాంకు రుణాల ఎగవేతలకు సంబంధించి ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వివిధ సంస్థలు, వ్యక్తులు బ్యాంకులకు ఎగవేసిన రుణాల మొత్తాన్ని బయటపెట్టాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. సీల్ట్‌ కవర్‌లో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) సమర్పించిన వివరాల ప్రకారం రుణాల ఎగవేతల మొత్తం లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నట్టు వెల్లడించింది. ఎగవేతదారుల పేర్లను గుట్టుగా ఉంచినా, ఎగవేతల మొత్తాన్ని వెల్లడిచేయాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. కానీ చిత్రంగా ఆర్‌బీఐ.. కోర్టు అభిప్రాయంతో విభేదించింది. పేర్లనే కాకుండా ఎగవేతల మొత్తాన్ని కూడా బయటపెట్టరాదని కోరింది. 'లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగవేసిన వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థల జాబితాను ఆర్‌బిఐ సమర్పించింది. 500 కోట్ల రూపాయలపై బడి వ్యక్తిగత స్థాయిలో రుణాలు తీసుకున్నవారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఒకవైపు, 15, 20 వేల రూపాయల అప్పు వసూలు కోసం బడుగు రైతులను వెంటాడి వేధిస్తుంటారు, మరోవైపు కొన్ని వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నవారు, అప్పులు ఎగవేసి కంపెనీలు ఖాయిలా పడినట్టు ప్రకటించి దర్జాగా జీవిస్తుంటారు... ఇదొక ద్వైధీ భావం అని కోర్టే పేర్కొనడం ప్రస్తుత పరిస్థితులు ఎంతటి దుర్భరంగా ఉన్నాయో తేటతెల్లమవుతోంది. పేర్లను బయటపెడితే దాని ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉంటుందని ఆర్‌బీఐ చెబుతోంది. ఇదొక ద్వంద్వ నీతే. చిన్న చిన్న జేబుదొంగల నిరోధానికి పటిష్టమైన చట్టాలు, ఫొటోలతో ప్రదర్శనలు చేపట్టే మన వ్యవస్థలో కోట్లకు కోట్లు కాజేసేవారి జీవితాలను ఎందుకు బజారున పడేయకూడదు. ఆ వివరాలను వెల్లడిస్తే.. భవిష్యత్తులో రుణాల ఎగవేత పరిస్థితులను నిరోధించవచ్చు. ఇప్పటి వరకూ కాజేసిన మొత్తంలో చాలా వరకూ రికవరీ చేయవచ్చు. అయినా ఆర్బీఐ ముందుకు రావడం లేదు. రైతులు, సామాన్యుల తీసుకునే రుణాల కోసం నానా ఇబ్బందులకు గురి చేస్తుంటే.. కోట్లాది రూపాయలను బుక్కేసి దర్జా వెలగబెడుతున్నవారికి ఇప్పటికీ కొమ్ము కాయడం ఓ రకంగా అక్రమాలకు ఊతమిచ్చినట్టే. అందుకే విజయమాల్యా , మోడీ లాంటి వారు కోట్ల రూపాయలు బకాయి ఉండి కూడా విదేశీయాత్రలు సకల సౌకర్యాలతో చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది. ఇందుకు ప్రభుత్వ పెద్దలు ఏకతాటిపై కలిసి పయనించాలి.

Comments