నుదిటిపై గన్‌.. తాళి కట్టరా..



నుదిటిపై గన్‌..తాళి కట్టరా..లేకుంటే పైకి పోతావు..ఏంటి వేషాలు వేస్తున్నావా? బతకాలని లేదరా?? కట్టరా నా కూతురికి తాళి అని బెదిరిస్తుంటే..బతుకుపై ఆశ ఉన్నవాళ్లు ఎవరైనా మూడు ముళ్లు వేయకుండా ఉంటారా? ఇష్టం లేకున్నా మనువాడక తప్పడం లేదు అక్కడ యువకులకు. అర్ధరాత్రి మహిళ ధైర్యంగా నడిచిన రోజే మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టని మహాత్ముడు చెప్పిన మాట. ప్రస్తుతం యువకులు అర్ధరాత్రి మాట దేవుడెరుగు..మిట్టమధ్యాహ్నం కూడా తిరిగే పరిస్థితి లేదు. ఒకవేళా తిరిగినా గుంపు గుంపులుగా వెళ్లాల్సిందే.. లేదంటే కిడ్నాప్‌ అయిపోతారు!! బలవంతంగా పెళ్లి కూడా చేసేస్తారు. ఇష్టం లేని పెళ్లి..అయినా కచ్చితంగా కాపురం చేయాలి. భార్యను సుఖపెట్టకపోయినా..ప్రేమగా చూడకపోయినా నా సామిరంగా ఇక కుమ్ముడే. ఇంతకీ ఈ సంస్కృతి ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? ఇంకెక్కడ మన లాలూ అడ్డా...బీహార్‌లో.. మరి ఈ పెళ్లి గోల..యువకుల వేదన ఏంటో తెలుసుకుందాం. 

బీహార్‌లో అమ్మాయిలు ఎక్కువ. అబ్బాయిలు చాలా తక్కువ. అమ్మాయిల వయసు పెరిగిపోతోంది. ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఏదో తెలియని ఇబ్బంది. సరైన వయసులో పెళ్లి చేసి..వారికి పుట్టబోయే బిడ్డలతో ఆనందంగా గడపాలనుకుంటారు. అయితే వారి ఆనందమే ఇప్పుడు బీహార్‌లో యువకులకు శాపంగా మారింది. అమ్మాయి తరఫు బంధవులు, రౌడీలను పురమాయించి బీహార్‌లో 18-35 ఏళ్ల లోపు యువకులను కిడ్నాప్‌ చేస్తున్నారు. బలవంతంగా తాళి కట్టిస్తున్నారు. ఎదురు తిరిగితే చావకొడుతున్నారు. ఇప్పటి వరకూ సుమారు 3వేల మంది యువకులు ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకుని అయిష్టంగా కాపురం చేస్తున్నారు. ప్రభుత్వం..పోలీసు వ్యవస్థ ఈ విష సంస్కృతిని అంతం చేయలేకపోతోంది. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. మా చెల్లికి నువ్వు నచ్చావు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాం. నువ్వు సిద్ధంగా ఉండు..అంటూ...ఆ ఉద్యోగికి అర్థం కాలేదు. లైట్‌ తీసుకున్నాడు. ఎప్పటిలాగే ఆఫీసుకు బయలు దేరాడు. అంతే సినిమాలో మాదిరిగా ఓ వ్యాన్‌ సర్రున దూసుకొచ్చింది. మనోడ్ని అందులో ఎక్కించుకుని తమ గ్రామం తీసుకుపోయారు. ఇదిగో నా చెల్లి..మనువాడు అంటూ గౌరవంగా బతిమిలాడాడు. ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నో అన్నందుకు గన్‌ తీసుకుని నుదిటిపై గురిపెట్టాడు. అంతే మరోమాట లేకుండా తాళ్లి కట్టేశాడు. ఇలా బీహార్‌లో నెలలో కనీసం మూడు నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని బీహార్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. యువకులను కాపాడాలని, కిడ్నాప్‌ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చూద్దాం..బీహారీ యువకులకు ఎంతలా రక్షణ కల్పిస్తారో.

Comments