మెడగాస్కర్‌లో తుపాను బీభత్సం

శుక్ర, శనివారాలలో మెడగాస్కర్‌లో సంభవించిన అవా తుపాను బీభత్సంతో వందలాది ఇళ్లు ధ్వంసం కాగా వేలాది మంది నిర్వాసితులయ్యారు. 29 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. మెడగాస్కర్‌ తూర్పు తీర ప్రాంతాన్ని తాకిన ఈ తుపానులో మరో ముగ్గురు గాయపడ్డారని, ఇద్దరు వ్యక్తుల గల్లంతయ్యారని అధికారులు వివరించారు. గంటకు దాదాపు 140-190 కి.విూ వేగంతో వీచిన తుపాను గాలులతో మడగాస్కర్‌ తూర్పు తీరం చిన్నాభిన్నమైంది.మెడగాస్కర్‌ తూర్పు తీరాన్ని తాకిన అవా తుపాను బీభత్సానికి కనీసం 29 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని మెడగాస్కర్‌ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ అధికారి మెలిసా వెనన్స్‌ వివరించారు. రాజధాని అంటనానారివోకు 400 కి.విూ దూరంలో వున్న హాతే మత్సియాత్రాలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారని ఆ ప్రాంత అధికారులు వివరించారు. ఈ తుపాను కారణంగా దాదాపు 13 వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని, మరో 16 వేల మందికి పైగా విద్యార్థులకు సెలవులు ప్రకటించామని చెప్పారు. గత ఏడాది మార్చిలో సంభవించిన ఎనావో తుపానులో 78 మంది మరణించిన విషయం తెలిసిందే.

Comments