చెన్నై : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక నందంబాక్కంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి ఆ మహిళ భర్త, సోదరుడు పోలీసుల వద్ద లొంగిపోయారు. చెన్నైలోని అశోక్‌నగర్ 83 వీధిలో మురళి (34), శోభన(29) దంపతులు నివసిస్తున్నారు. మురళీ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. శోభన ప్రతిరోజూ ఉదయం నందంబాక్కం వరకూ వాకింగ్‌కు వెళుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కేకేనగర్ 16వ అవెన్యూకు చెందిన విశ్వనాథన్ (31) అనే వివాహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మురళి ఆమె శీలాన్ని శంకించి తరచూ గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో వాకింగ్‌కు వెళుతున్న శోభనను మురళి, అతడి బావమరిది కన్నన్ వెంబడించారు. నందంబాక్కం బర్మాకాలనీ సమీపంలోని మైదానంలో శోభన, విశ్వనాథన్‌తో కలిసి పొదలమాటుకు వెళుతుండగా మురళి, కన్నన్ కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో విశ్వనాథన్ తలపగిలి రక్తపు మడుగులో పడ్డాడు. శోభన తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన తర్వాత మురళి, కన్నన్ గిండీ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు వెంటనే బర్మాకాలనీ మైదానానికి వెళ్లి గాయపడిన శోభనను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విశ్వనాథన్‌ను పరిశీలించి చూడగా అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. విశ్వనాథన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Comments
Post a Comment