వివిధ సెట్ల పరీక్షా షెడ్యూల్‌ విడుదల

అమరావతి : రాష్ట్రంలో వివిధ సెట్లకు నిర్వహించే పరీక్ష తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సోమవారం అమరావతిలో విడుదల చేశారు. అన్ని సెట్లూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. వారంలోపే ఫలితాలను విడుదల చేస్తామని గంటా చెప్పారు. ఎంసెట్‌ నిర్వహణకు 115 నుంచి 150 వరకు సెంటర్లను ఏర్పాటు చేస్తామని గంటా ప్రకటించారు. ఏప్రిల్‌ 19న ఎడ్‌సెట్‌, లాసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 26న ఏపీ ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మే 2న ఐసెట్‌, మే 3న ఈసెట్‌, మే 4న పీయూ సెట్‌ ఉంటుందన్నారు. మే 10 నుంచి 12 వరకు పీజీ సెట్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే విశాఖలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను యూనిర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ యూనివర్సిటీకి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ను కాకినాడ జేఎన్‌టీయూ, ఐసెట్‌ను ఎస్వీ యూనివర్శిటీ, ఈసెట్‌ను జేఎన్‌టీయూ అనంతపురం, పీఈ సెట్‌ను ఏఎన్‌యూ నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, ఫలితాలను వారంలోపే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Comments