అమరావతిః ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష్లలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, విద్యార్థుల జంబ్లింగ్ తో పాటు ఎగ్జామినర్ల జంబ్లింగ్ చేసే విధానాన్ని అనుసరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీమతి బి. ఉదయలక్ష్మీ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విద్యార్థులతో పాటు ఎగ్జామినర్లకు జంబ్లింగ్ విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద సీసీటీవీ లను ఏర్పాటు చేసి కంప్యూటర్ ద్వారా మానిటరింగ్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఎథికల్ అండ్ హ్యుమాన్ వాల్యూస్ అంశానికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని పరీక్ష జరిగే రోజు .. ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో నుంచే ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20న ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలల మేనేజ్ మెంట్లతో మంత్రి గంటా సమావేశమై... ప్రాక్టికల్ పరీక్షలు, ఇతర అంశాలపై పలు సూచనలు చేయనున్నారు. అదే విధంగా.. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాళ్లతో 23న వీడియా కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు.

Comments
Post a Comment