పట్టా కోసం.. వంట



కొందరు చదువుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో. అది ఇష్టంతో..అందుకే వాళ్లకు సరస్వతి కటాక్షం కూడా అబ్బుతుంది. ఈ కోవకు చెందిన అమ్మాయే స్నేహా లింగోకర్‌. కేరళా యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మేటిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. అందరిలాగే ఈమెకు కేవలం చదువుకుంటే ఆ విషయం ప్రస్తావించనవసరం లేదు. కానీ ఈ చదువులు తల్లి ఉదయమంతా యూనివర్సిటీలో చదువుకుంటూ..సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తిరువనంతపురంలోని ఓ రద్దీగా ప్రాంతంలో రోడ్డు పక్కన నాలుగు పరదాలు కట్టుకుని, గ్యాస్‌ స్టవ్‌ మీద పరోటాలు చేస్తూ అమ్ముతోంది. పని పూర్తవగానే సర్దుకుని ఇంటికి వెళ్లి పీహెచ్‌డీకి సంబంధించిన థీసిస్‌ రాసుకుంటుంది. గతేడాది స్నేహకు ఆమె తల్లిదండ్రులు ప్రేమ్‌శంకర్‌ అనే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. కానీ స్నేహ మాత్రం పీహెచ్‌డీ పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అని మొండిపట్టు పట్టింది. అదే విషయం తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కూడా చెప్పింది. స్నేహ ఆలోచనను, పట్టుదలను గమనించిన ప్రేమ్‌శంకర్‌ స్నేహను ప్రోత్సహించాడు. అంతేకాదు.. ఆమెకు పరోటాలు అమ్మడంలో సహాయం కూడా చేస్తున్నాడు.

Comments