అనకాపల్లి కుర్రోడు..సినీరంగాన్ని ఏలుతున్నాడు
ఓ కుర్రోడు చదువుకుంటున్న సమయంలో కళాశాల ఫంక్షన్‌లో ఓ చిన్న నాటకం వేశాడు..నూకరాజు పాత్రలో మెప్పించాడు..అంతే ఆడిటోరియంలో చప్పట్లు మోగాయి. ఆ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నరసింగరావుగారు ఉండేవారు. ఆయన చూస్తేనే విద్యార్థులకు హడల్..కట్ చేస్తే నూకరాజు పాత్రలో మెప్పించిన నక్కిన త్రినాథ్‌ను హగ్ చేసుకున్నారు. ఒరేయ్ చాలా బాగా చేశావ్‌రా.. నువ్వు కచ్చితంగా సినిమా రంగంలో రాణిస్తావు..ట్రై చేయంటూ ప్రోత్సహించారు. అంతే క్లాస్ రూంలో కూడా నర్సింగరావుగారే మాటలే తరుముతుండేవి. మనసు సినిమా వైపు పరుగులు తీసేవి. ఇంట్లో మేనమావలు, బావలు కూడా సినిమా చూసి వచ్చిన తరువాత విశ్లేషణలు చెప్పుకునేవారు. ఈ ప్రభావం కూడా యంగ్ త్రినాథ్‌పై ప్రభావం చూపాయి. అంతే డిగ్రీ అయిపోయిన తరువాత రాసుకున్న రెండు కథలతో హైదరాబాద్ చెక్కేశాడు. ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానంటూ చెప్పి..తన కలల సాకారం చేసుకునే దిశగా అడుగులేశాడు. 1994 నుంచి 2004 వరకు మధ్య జరిగిన నక్కిన త్రినాథ్ ప్రయాణం. ఇప్పుడు అదే త్రినాథ్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తక్కువ బడ్జెట్‌తో నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తున్నాడు. నక్కిన త్రినాథ్ త్రినాథ్ మన అనకాపల్లి వాసి కావడం గర్వకారణమనే స్థాయికి ఎదిగిపోయాడు. విశాఖ వాసులకు స్ఫూర్తిగా నిలిచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనకాపల్లి వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుడు, నాగార్జున వీర అభిమాని మళ్ల సురేంద్ర నక్కిన త్రినాథ్, మరో దర్శకుడు ఆర్‌వీ సుబ్రహ్మణ్యం కుటుం సభ్యులను లంచ్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసేపు త్రినాథ్‌తో చిట్‌చాట్..
ఆయన ప్రోత్సాహంతోనే..
అనకాపల్లి డీవీఎన్ కశాశాలలో డిగ్రీ చదువుతున్న రోజులవి.. కశాశాల ఫంక్షన్‌లో దాడి వీరభద్రరావు రాసిన ఓ స్క్రిప్ట్‌లో నటించా. నాతో పాటు దాడి రత్నాకర్ (దాడి వీరభద్రరావు తనయుడు)కూడా నటించాడు. నేనుచేసిన నూకరాజు పాత్ర చాలా మందికి నచ్చింది. అందరూ అభినందించారు. మా ప్రిన్సిపాల్ నర్సింగరావుగారు మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తూ..సినిమాల్లో ట్రై చేయమని చెప్పారు. అంతవరకూ రాని ఆలోచనకు ఆయనే బీజం వేశారు. అంతే సినిమా రంగం వైపు అడుగులు వేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. 2000లో హైదరాబాద్ వెళ్లిపోయా.
లెక్కలు చెబుతూ..
హైదరాబాద్‌లో ఎవరూ తెలియదు. సినిమా ఛాన్స్‌లు కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో కూడా తెలియదు. అందవరకూ హైదరాబాద్‌లో ఉండడమంటే మాటలు కాదు. ముందు కనీసం తినడానికి, ఉండడానికి ఇబ్బంది కలగకూడదు. చదువుకున్న చదువు ఎప్పటికీ వృథా కాదు. బీఎస్సీ మ్యాథ్స్ స్టూడెంట్‌ని కావడంతో ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టా. వచ్చిన డబ్బులతో సినిమా అవకాశాలు కోసం తిరిగేవాడ్ని.
తొలిసారి...
టి. ప్రభాకర్ తీసిన (ఆల్‌రౌండర్) చిత్రానికి అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్‌లో చేరా. ఆ తరువాత మీనాక్షి అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. అదే సమయంలో సంపత్ నంది పరిచయమయ్యాడు. నాతో ట్రావెల్ చేస్తావా? అంటూ అడిగాడు. దీంతో ఇద్దరం స్నేహితులమయ్యాం. ఈ క్రమంలో సంపత్ నంది ఓ ఆఫర్ ఇచ్చాడు. ట్రాక్స్ రాయమని. ఒక్కో ట్రాక్‌కు రూ.1500 ఇచ్చేవాడు. దీంతో ఎంచుకున్న రంగంలో అవకాశం తలుపు తట్టి రావడంతో ట్యూషన్లకు ఫుల్‌స్టాప్ పెట్టి..పూర్తిగా సినిమా రంగంలోనే ఉండిపోయా.
తొలి సినిమాకు..
దర్శకుడిగా మొదటి చిత్రం మేం వయసుకు వచ్చాం. బ్లాక్ బాస్టర్. యువతను ఎంతోగానే ఎట్రాక్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా నా పేరు మార్మోగింది. అందరీ దృష్టి నాపై పడింది. నిర్మాతలూ క్యూ కట్టారు. ఈ క్రమంలో విజయానందంలో ఓ చిన్న పొరపాటు జరిగింది. అదే ప్రియతమా నీవచట కుశలమా సినిమా చేయడం. పూర్తిగా నిరాశ పరిచిందా చిత్రం. నువ్విలా నేనిలా సినిమా కూడా యూత్ బాగా ఎట్రాక్ట్ చేసింది.
సినిమా చూపిస్తా మావతో బ్లాక్ బాస్టర్
రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన సినిమా చూపిస్తామావ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతవరకూ క్లాసికల్ టచ్ సినిమాలు చేసిన నాకు పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇది. నన్ను ఆర్థికంగా కూడా స్థిరపడేలా చేసిందీ చిత్రం.
దిల్‌రాజు రాకతో టెన్షన్ పడ్డా
ఈ చిత్రాన్ని విడుదల ముందు ఆర్ ఆర్ కూడా లేని సమయంలో సినిమా చూపిస్తా మావ మూవీని చూసేందుకు వస్తున్నారని తెలిసింది. కాళ్లు, చేతులూ ఆడలేదు. దిల్ రాజు వంటి సినిమా మీద పూర్తి పట్టు ఉన్న నిర్మాత నా సినిమా చూసేందుకు రావడమేంటి. ఏం అంటారో..ఎలా రియాక్ట్ అవుతారోనని చాలా టెన్షన్ పడ్డా. చిత్రం చూసి..కారులోకి రా మాట్లాడాలి అన్నారు.. అంతే ఇక నా పని అయిపోయిందనుకున్నా. కారులో కూర్చున్నా.. సినిమా చూపిస్తా మావా సూపర్ హిట్ గ్యారంటీ.. దాని గురించి వదిలేవ్..నువ్వు నా బ్యానర్‌లో సినిమా చేస్తున్నావు..రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అని దిల్ చెప్పడంలో కలా..నిజమా అనుకున్నా. చెప్పలేనంత ఆనందం..ఎప్పటికైనా దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ఇంత త్వరగా వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆ సినిమాయే నానితో తీసిన నేను లోకల్.
నేను లోకల్‌తో మెప్పించా..
నేను లోకల్ చాలి తక్కువ బడ్జెట్‌తో నిర్మించా. 60 కోట్లకుపైగా వసూలు చేసి అంతవరకూ నానికి ఉన్న వసూళ్లలో నెంబర్ వన్‌గా ఈ చిత్రం నిలిచింది. ఈ సినిమా చూసి రాంచరణ్ కూడా ఫోన్ చేసి అభినందించారు. దిల్ రాజు బ్యానర్‌లోనే రామ్ హీరోగా మార్చిలో కొత్త సినిమా ప్రారంభం కానుంది.
నేను రాసిన రెండు కథల్లో...
హైదరాబాద్‌కు రెండు కథలతో వెళ్లా. ఆ రెండు కథల్లో ఒకటి మాత్రం ఇప్పటికీ లేటెస్ట్ స్క్రిప్ట్. అయితే భారీ బడ్జెట్‌తో కూడుకున్నది. నా డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఇదే. ఎప్పటికైనా తొలి కథతో సినిమా తీస్తా..
టాలెంట్ ఉంటే ...
సినిమా రంగంలో టాలెంట్ ఉంటే ఎగరేసుకుపోతారు. ఇందుకు నేనే పెద్ద ఉదాహారణ. ఏదైనా మనసుతో చేయండి. కచ్చితంగా విజయం సాధిస్తారు. అనుకున్నది సాధించాలంటే ఉండాల్సింది టాలెంట్ మాత్రమే. ఈ విషయం గుర్తిస్తే ఎవరైనా విజయం సాధింవచ్చు.

Comments
Post a Comment