న్యూఢిల్లీ: ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న వివాదాస్పద చిత్రం 'పద్మావత్'కు కష్టాలు వీడటం లేదు. ఓవైపు కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాకు వ్యతిరేకంగా జోరుగా ఆందోళనలు నిర్వహిస్తుండగా.. ఈ నిరసనల నడుమ సినిమాను తమ రాష్ట్రాల్లో విడుదల చేయలేమంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 'పద్మావత్' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుపనుంది.ఈ చిత్ర ప్రదర్శనపై నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో(రాజస్తాన్, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్) విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గతంలో ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలు సైతం పద్మావత్‌పై నిషేధం విధించకుండా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలిచ్చింది. పద్మావత్ విడుదలైన తరువాత శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది. ఈ ఆదేశాలతో భగ్గుమన్న కర్ణిసేన 'పద్మావత్' సినిమాను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సినిమా ప్రదర్శించిన థియేటర్లపై దాడులకు దిగుతూ.. ఆందోళనలు, నిరసనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పద్మావత్ సినిమా ఈ నెల 25న సజావుగా విడుదలకావడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది.

Comments
Post a Comment