ధనలక్ష్మి తలుపు తట్టింది


న్యూ ఇయర్‌ రోజు పుట్టిన బిడ్డకు రూ.5లక్షలు 
పురిటినొప్పులు భరిస్తూనే పుట్టబోయే బిడ్డ లక్షాధికారి అవుతుండడం ఏ తల్లికైనా ఆనందమే కదా...ఈ ఆనంద వాతావరణం కల్పించేలా బెంగళూరు మేయర్‌ సరికొత్తగా ఆఫర్‌ ప్రకటించారు. ఆడపిల్లలు ఇంటి దీపాలని..వారిని వెలగనివ్వాలని కోరుతూ ఈ ఆఫర్‌ ప్రకటించారు. జనవరి 1వ తేదీ పుట్టిన ఆడబిడ్డలకు రూ.5లక్షల ప్రైజ్‌ మనీ అనౌన్స్‌ చేశారు. ఇందులో భాగంగా కొత్తసంవత్సరం రోజు డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు పేదింటికి చెందిన మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలోనే నార్మల్‌ డెలివరీతో అమ్మాయికి జన్మనిస్తే ..అలా పుట్టే ఆడపిల్లలకు రూ.5లక్షలు,డిగ్రీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ప్రకటించినట్లుగా ఆడపిల్లకు జన్మించిన దంపతులకు రూ.5లక్షల చెక్‌ను అందించారు. రాజాజీనగర్‌కు చెందిన పుష్ప అనే మహిళకు పురిటినొప్పులతో డిసెంబర్‌ 31అర్ధరాత్రి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్చారు. సరిగ్గా కొత్త సంవత్సం మొదలైన ఐదు నిమిషాలకు(12.05) ఆడబిడ్డ పుట్టింది. ఆస్పత్రి వర్గాల సమాచారంతో మాటిచ్చిన ప్రకారం మేయర్‌ సంపత్‌రాజ్‌ ఆసుపత్రికి వెళ్లి బాలింత పుష్పకు చెక్‌ అందజేశారు.ఈ సందర్భంగా ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ.. వచ్చిన డబ్బును తమ బిడ్డ చదువుకు ఉపయోగిస్తామని అన్నారు.

Comments