ఇదీ తిండిపెట్టే రైతు హీనస్థితి
దేశంలో 2015లో ప్రతి పదిమంది రైతులలో నలుగురు, 2014లో ప్రతి పదిమందిలో ఇద్దరు రుణభారం వలన ఆత్మహత్య చేసుకున్నారు. గత 11ఏళ్లలో గ్రావిూణ రైతులు అధికంగా అప్పులలో కూరుకుపోయారు. ఇది ప్రభుత్వ సమాచారం ప్రకారం వేసిన అంచనా. ఇటీవలి గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలలో గ్రావిూణ ప్రాంతాలలో అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) 16 సీట్లు కోల్పోయింది. ఆయా నియోజక వర్గాలలో బిజెపి 40 శాతం కంటె తక్కువ ఓట్లను పొందడానికి కారణం గ్రావిూణ రైతులలో పెరిగిన అశాంతే. వ్యవసాయ ఆర్థిక స్థితి దిగజారడమే అందుకు హేతువు. బిజెపి పాలనలోని వ్యవసాయ రాష్ట్రాలయిన చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌సహా 2018లో మొత్తం 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న గ్రావిూణ రుణభారం నిరాశా నిస్పృహలు, మరణాలు, ఆత్మహత్యల పరిస్థితిని జర్నలిస్టుల బృందం ఒకటి అధ్యయనం చేసింది. వాతావరణ మార్పులవలన జరిగే రైతుల ఆత్మహత్యలు కూడా ఈ ఏడాది పెరిగే సూచన ఉంది. అస్థిర వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. వాతావరణం మరింతగా దిగజారే ప్రమాదం నూతన సంవత్సరంలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి గ్రావిూణ ఆర్థికమాంద్యం మరింతగా ముదిరే సూచన కూడా ఉంది. రైతులు 2022 నాటికి తమ ఆదాయాలను రెట్టింపు చేసుకోగలుగుతారని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హావిూ నెరవేరే ఆశలు లేవు.చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మొత్తం గ్రావిూణ జనాభా 123.6 మిలియన్‌లు. ఇది 2011 జనాభా లెక్కలు ప్రకారం తేలిన అంకె. ఇది మెక్సికో ప్రస్తుత జన సంఖ్యతో సమానం. అది జనాభాలో ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉంది. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాలలో వ్యవసాయ వృద్ధి తిరోగమనంలో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో రైతు లోకం అశాంతిలో మగ్గుతోంది. రైతుల ఆత్మహత్యల రేటు పెరగడం ప్రస్తుతం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న వాస్తవం. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే దారిలేక వారు ఈ తీవ్ర చర్యకు దిగుతున్నారు. దేశంలో 2015లో మొత్తం 8007 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014లో 5,650 నుంచి ఏడాదిలో ఈ సంఖ్య 41.7 శాతం పెరిగింది. ఇలా ఆత్మహత్య చేసుకున్న 39 శాతం మంది రైతులు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నారు. 2015 జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ఈ సమాచారం అందించింది. 2014లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో 20.6 శాతం మంది అప్పుల భారంతోనే అందుకు ఒడిగట్టారు.2013లో ప్రతి మూడు గ్రావిూణ కుటుంబాల్లో ఒకటి రుణాల ఊబిలో కూరుకుపోయి ఉంది. 2002లో కంటే ఇది 26.5శాతం ఎక్కువ. 2013లో 56 శాతం గ్రావిూణ కుటుంబాలు రుణ భారంలో ఇరుక్కున్నాయి. సగటున ఇది కుటుంబానికి రూ. 1.03 లక్షలు. ఇది ఇంచుమించు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ధర (రూ.1.09లక్షలు)తో సమానం. ఐ ఫోన్ చీ ధర (రూ. 1.02 లక్షలు) తో కూడా సమానం. అలాగే పానా సోనిక్ 55 అంగుళాల ప్లాట్ టివి రేటు కంటే ఎక్కువ. దాని ఖరీదు 99 వేలే. ఇది గ్రావిూణ, పట్టణ ప్రజల మధ్య అంతరాన్ని సూచించే అంశం. ఆ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 833 మిలియన్ల మంది, అంటే దేశ జనాభాలో 68.8 శాతం మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలా మంది నిరుపేదలు.
అభివృద్ధి చెందిన సంపన్న రాష్ట్రాలుగా చెలామణి అవుతున్న రాష్ట్రాలలోనే రైతులు అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్న కేసులు అధికం. మహారాష్ట్రలో 41.7 శాతం మంది రైతులు (1,293 మంది). 2015లో వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో 846 మంది (30.5 శాతం) రైతు ఆత్మహత్యలతో కర్నాటక నిలిచింది. మూడో స్థానంలో 632 మంది (20.4శాతం) రైతు ఆత్మహత్యలతో తెలంగాణ నిలిచింది. 2018లో ఎన్నికల జరగనున్న ప్రధాన రాష్ట్రాల్లో కర్నాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమైనవి. పేద రాష్ట్రాల్లో సొంత భూములు అంతగాలేని రైతుల్లో అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అధికంగా కనపడింది. ఆయా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా కీలకమైనవి. ఆ రాష్ట్రాల్లో 75 శాతం మంది రైతులకు ఒక హెక్టార్ (2.5 ఎకరాల) కంటే తక్కువ భూ కమతాలు ఉన్నాయి.
సంస్థాగత రుణాలు లభించడంలో ఆలస్యంవల్ల పేద రాష్ట్రాల్లో రైతులు అధికంగా ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారు. హెచ్చు వడ్డీకి సులభంగా దొరికే ఆ రుణాలపైనే రైతులు ఆధారపడ్డం వల్ల వడ్డీ బాకీలు పేరుకుపోయి అసలు వడ్డీ కలిపి మోయలేని భారం అవుతోంది. 2013లో వాణిజ్య బ్యాంకులు, గ్రావిూణ బ్యాంకులు, బీమా సంస్థలు వంటివి గ్రావిూణ ప్రాంతాల్లో 56 శాతం రైతులకు రుణాలు ఇచ్చాయి. వడ్డీ వ్యాపారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వద్ద 44 శాతం మంది రైతులు ప్రైవేటు రుణాలు తీసుకున్నారు. గ్రావిూణ రుణ భారంలో వడ్డీ వ్యాపారుల వాటా అత్యధికంగా 28.2 శాతం వరకూ ఉంది. సులభంగా రుణాలు పొందడానికి గ్రావిూణ పేద రైతులు ఇంకా స్థానిక వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారనడానికి ఇది నిదర్శనం. గ్రావిూణ రుణాల్లో వాణిజ్య బ్యాంకులు తదితర సంస్థల వాటా 25.1 శాతం మాత్రమే. సహకార సంస్థలు, సహకార బ్యాంకుల వాటా 24.8 శాతం. మన దేశంలో గ్రావిూణ రుణ భారం పెరుగుదలలో రెండు గుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వడ్డీ వ్యాపారుల ఉడుంపట్టు మరింతగా బిగిస్తోంది. ఆ పట్టులోంచి బయటపడలేక బ్యాంకులకు ఇతర సంస్థలకు తీసుకున్న రుణాలను ఎగవేయక తప్పని పరిస్థితులు గ్రావిూణ రైతుకు ఉన్నాయి.
బ్యాంకుల రుణాల మంజూరు చాల కష్టతరమైన ప్రక్రియతో ఉండడం కూడా ఈ పరిస్థితికి ముఖ్య కారణం. బ్యాంకుల సేవలు పెరుగుతున్నా, గ్రావిూణ ప్రాంతాలకు అవి ఇంకా అందకుండా ఉన్నాయి. ఇది 2013లో రిజర్వు బ్యాంకు ఒక నివేదికలో స్పష్టం చేసిన అంశం. రానున్న ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలలో ఈ వాస్తవాలు ప్రభావం చూపుతాయా అన్నదానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇవి ప్రధానంగా గ్రావిూణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలు కాబట్టి పట్టణ ప్రాంతంలో వీటి ప్రభావం ఎంత అన్నది అంచనాకు అందడం లేదు. అయితే మోడీ హావిూ ఇచ్చిన 'అచ్ఛే దిన్' ను ఈ వాస్తవాలు గ్రామాలు, పట్టణాలలో సమంగా దూరం చేస్తున్నాయని చెప్పకతప్పదు.

Comments
Post a Comment