జల్సాలతో నాశనం

హైఫై లైఫ్‌ అదుపు తప్పుతోంది. జల్సాలకు హద్దు లేకుండా పోతోంది. లెక్కకు మించి సంపాదించే తల్లిదండ్రులుం డటంతో పిల్లలు లగ్జరీ లైఫ్‌ను పరిమితికి మంచి ఎంజాయ్‌ చేస్తున్నారు. మద్యం మత్తులో వికృత చేష్టలకు పోతున్నారు. మొన్న హైదరాబాద్‌లో మద్యం మత్తులో బైక్‌ రేస్‌కు పాల్పడిన యువకులను అదుపు చేసిన ట్రాఫిక్‌ ఎస్సైను బెదిరించారు. దాదాపు కొట్టేంత పనిచేశారు. ఆ ఎస్సై శాంతిభద్రతల విభాగం పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. తాగి తందనాలు ఆడి పైగా పోలీసులపై విరుచుకుపడుతున్న యువత ఎంతకు తెగిస్తోందో అర్థమవుతుంది. బ్యాగ్రౌండ్‌ ఉన్నోళ్లంతా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నడిరోడ్డుపై అమ్మాయిలను ఎత్తుకెళ్లడం, ర్యాగింగ్‌ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో డ్రంక్‌ డ్రైవ్‌ చేస్తూ ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరెందర్నో పొట్టన పెట్టుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మద్యం మత్తులో కారు డ్రైవ్‌ చేస్తూ చిన్నారి రమ్య మృతికి కారకులయ్యారు. నిన్నటినిన్న బుల్లితెర సూపర్‌స్టార్‌ యాంకర్‌ ప్రదీప్‌ మోతాదుకు మించి మద్యం తాగి కారు డ్రైవ్‌ చేసుకుంటూ పోలీసులకు చిక్కాడు. ప్రమాదం జరగలేదు కానీ...ఎంతో క్రేజ్‌ ఉన్నప్రదీప్‌ ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థుల స్థాయి నుంచే తాగుతున్నారంటే తల్లిదండ్రుల పెంపకాన్ని కచ్చితంగా నిందించాల్సిందే. చదువు పక్కన పెట్టి జల్సాలకు పాల్పడుతున్న విద్యార్థులను ఆ బాట నుంచి తప్పించే ప్రయత్నం జరగాలి. ఒకరి వికృత సంతోషం మరో కుటుంబంలో తీరని కడుపుకోత మిగులుస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా గమ్యాన్ని తొందరగా చేరుకోవాలన్న ఆలోచనతో అడవిలో జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలోనే హైదరాబాద్‌ పోలీస్‌ నంబర్‌ వన్‌గా ఉన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులలో పెద్ద పెద్ద వాళ్లనే పట్టుకుంటున్నారు. 16, 17 సంవత్సరాల కుర్రాళ్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. కళాశాలల్లో సదస్సులు నిర్వహించాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న విద్యార్థులు...వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు రప్పించి గట్టిగా హెచ్చరించాలి. పిల్లలను అతి ముద్దు చేసి సమాజానికి కీడు తలపెట్టేలా పెంచవద్దని కౌన్సెలింగ్‌ చేయాలి. చదువుకునే వయసులో చదువే పరమావధిగా ఉండాలి.

Comments