ప్రశ్నిస్తే అరెస్టులా


వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారధి

కంకిపాడు: వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రభుత్వం ఈ విధంగా అరెస్టులు చేయడం వారి చేతకాని తనమన్నారు. హామీలు నెరవేర్చకుండా మళ్లీ జన్మభూమి ఎలా నిర్వహిస్తారని ప్రజలు ఇప్పటికే జన్మభూమి కార్యక్రమాలకు వచ్చిన అధికారులను, నాయకులను నిలదీస్తున్నారని, ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీకి ఎక్కడ మైలేజ్‌ వస్తుందోనని భయపడి ఈ విధంగా అరెస్టులకు పూనుకుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ సభలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అయితే సమస్యలను లేవనెత్తే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. నిలదీసిన విపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభ నడిపిస్తున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేశామని చెప్పే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి ప్రతపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ ఎవరికి చేశారని, రుణాలు చెల్లించాలని బ్యాంక్‌ల నుంచి మహిళలకు నోటీసులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే అడ్డుకోవడం సరికాదంటూ...ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఆయన నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకున్నారు.అలాగే వైఎస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జన్మభూమికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళుతున్న తమని భయపెట్టి నోరు మెదపకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

Comments