తలైవాతో లారెన్స్‌ అడుగులు

తలైవా రాజకీయ ప్రవేశం హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళనాట కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇటు సినీ తారల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే బిగ్‌ బీ అమితాబ్‌ రజనీకి శుభాక్షాంలు తెలిపారు. తాజాగా తనకు బతుకునిచ్చిన రజనికి సేవ చేసే అదృష్టం తనకు లభించడం దేవుడిచ్చిన వరమని నృత్య దర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ చెప్పాడు. అందుకే రజనీ సార్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించాడు. సౌతిండియాలో ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత అంతటి ఛరిష్మా ఉన్న స్టారాధిస్టార్‌గా రజనీని అభిమానిస్తారంతా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా అభిమానులు ఉన్నారు. సరిగ్గా ఇదే పాయింట్‌ తమిళనాడులోని ఇతర పార్టీల వాళ్లను భయపెడుతోంది. సినిమావాళ్లు ఏం చేస్తారులే! అంటూనే ఎవరికి వాళ్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నారు. రజనీ రాక సౌతిండియాలో పాగా వేయాలనుకున్న భాజపాకు సంకట సన్నివేశం క్రియేట్‌ చేసింది. దేవుడు శాసించాడు.. బరిలో దూకేస్తున్నా! అని ప్రకటించగానే రజనీకాంత్‌ పార్టీలో చేరేందుకు సెలబ్రిటీ ప్రపంచం ఉవ్వెత్తున రెడీ అవుతోంది. అందరికంటే ముందుగానే లారెన్స్‌ రజనీ పార్టీలో చేరిపోతున్నానని ప్రకటించాడు. రజనీతో చేతులు కలిపి.. పాలిటిక్స్‌లో తొలి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించి హుషారు పెంచాడు. తన రాజకీయారంగేట్రంపై అధికారికంగా ఈనెల 4న ఒక బహిరంగ వేదిక ద్వారా ప్రకటిస్తానని అన్నాడు. సినిమాల్లో రజనీ శిష్యుడిగా, తనకు వీరాభిమానిగా గొప్ప ఆదరణ చూరగొన్నాడు. హీరోగానూ సక్సెసవ్వడం వెనక రజనీ సపోర్ట్‌ ఉంది. రజనీకాంత్‌ తనకు అవకాశాలిచ్చి ఎంకరేజ్‌ చేసిన దేవుడు అని పలు సందర్భాల్లో ప్రకటించాడు లారెన్స్‌. అంతేకాదు.. మొన్నటి చెన్నయ్‌ విలయంలో ప్రజాజీవనం కకావికలం అయినప్పుడు కోలీవుడ్‌ అగ్ర హీరోలకే చెమటలు పట్టే రేంజులో ఏకంగా కోటి రూపాయలు ప్రకటించి సంచలనం సృష్టించాడు. తమిళ ప్రజలు ఆపదలో ఉన్నారు అంటే తానున్నానని ఉదారంగా విరాళాలిచ్చే లారెన్స్‌పై ప్రజల్లోనూ సానుకూల పవనాలున్నాయి. ఇప్పటికే ఎందరో క్యాన్సన్‌ బాధిత పిల్లలను అక్కున చేర్చుకుని సేవలు చేస్తున్నాడు. మంచి మనసున్న లారెన్స్‌కు తమిళనాట మంచి పేరుంది. రజనీ తొందర్లోనే పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి మునుముందు ఇంకెంత మంది సెలబ్రిటీలు అతడి పార్టీలో చేరతారో చూడాలి.

Comments