వాయిస్‌ కాల్‌తోపాటు వీడియో కాలింగ్‌

                                                     వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో వాయిస్‌ కాల్‌ మాట్లాడుతున్న వారు వీడియో కాల్‌కు మారే సదుపాయం లేదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాట్లాడుతున్న కాల్‌ కట్‌ చేసి, మళ్లీ వీడియోకాల్‌ చేయాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ ఇబ్బంది తప్పనుంది. వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడే కావాలనుకుంటే నేరుగా వీడియోకాల్‌కు మారవచ్చు.వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఇది అందుబాటులోకి వచ్చినట్లు 'ది ఇండిపెండెంట్‌' తన నివేదికలో పేర్కొంది.వాయిస్‌ కాల్‌ మాట్లాడుతుండగా, కేవలం స్విచ్‌ అనే బటన్‌ను ట్యాప్‌ చేయటం ద్వారా వీడియో కాల్‌కు మారవచ్చు. అయితే వీడియోకాల్‌కు మారే బటన్‌ ట్యాప్‌ చేయగానే అవతలి వ్యక్తికి రిక్వెస్ట్‌ పంపబడుతుంది. అతను లేదా ఆమె ఆ వీడియోకాల్‌కు మారాలనుకుంటే రిక్వెస్ట్‌కు అనుమతి ఇస్తే సరిపోతుంది. ఒక వేళ తిరస్కరిస్తే వాయిస్‌కాల్‌ కొనసాగుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌ కాల్స్‌ కేవలం ఒకరితోనే మాట్లాడే అవకాశం ఉంది. అయితే గ్రూప్‌లోని మిగిలిన వారితోనూ మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకురావడానికి వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోందని నివేదిక తెలిపింది. ఈ సరికొత్త ఫీచర్‌ గురించిన సమాచారాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫోలో కూడా ఉంచారు. బీటా వెర్షన్‌ను లాగిన్‌ కావడం ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు.గ్రూప్‌లో ఎవరికైతే మనం రిప్లై ఇవ్వాలనుకుంటున్నామో వారికే సమాధానం ఇచ్చేలా వాట్సాప్‌ గత నెలలో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫీచర్‌ను వెంటనే తొలగించారు. డెవలపర్లు పొరపాటున ఆ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేశారని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది.

Comments