పవన్‌కు వీరతిలకం దిద్ది హారతిచ్చి సాగనంపిన లెజినేవా

జనసేన అధ్యక్షుడు, పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇక పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారించనున్నారు. ప్రజా సమస్యలు అధ్యయనానికి ఆయన చేపట్టిన రాజకీయ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరిన పవన్‌కు ఆయన సతీమణి అన్నా లెజినేవా ఎదురొచ్చి హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయం వద్దకు పవన్‌ అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసిన పవన్‌ అక్కడ నుంచి బయలుదేరారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్న పవన్‌, స్వామి దర్శనానంతరం కరీంనగర్‌ బయలుదేరతారు. రాత్రికి అక్కడే బసచేసి, మంగళవారం ఉదయం 10.40 గంటలకు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి కొత్తగూడెం చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు వెళ్లి, మధ్యాహ్నం ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమవుతారు. మొదటి విడత యాత్రలో భాగంగా పవన్‌.. మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే తాను యాత్ర చేపడుతున్నట్లు ఆయన ఇప్పటికే వెల్లడించారు. పాదయాత్ర వల్ల ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని, ప్రత్యేక వేదిక ద్వారా కార్యకర్తలను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆయన తెలిపారు.

Comments