భారతదేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్యాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించి ఉన్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థ స్థానాలు పుట్టుకువస్తే.. మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని తిరుమల ప్రాంతంలో ఎన్నో తీర్థస్థానాలు కొలువై ఉన్నాయి. ఈ తీర్థ స్థానాలు మన హిందూ దేవతలకు సంబంధించిన కొన్ని పురాణ గాథలుగా రూపుదిద్దుకుని ఉన్నాయి.
పాండవ తీర్థం : పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘోరమైన కురుక్షేత్ర సంగ్రామం తరువాత.. పాండవులు తాము చేసిన బ్రహ్మహత్యా పాపాలను పోగొట్టుకోవడానికి అభిషేక స్నానాలను ఆచరించారు. అనంతరం ఆ క్షేత్ర పాలకునిని పూజించి, శ్రీనివాసునుని దర్శించుకున్నారు. ఆనాడు పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయవలం వల్లే దీనికి పాండవ తీర్థం అనే పేరు వచ్చింది. ఈ తీర్థం తిరుమల దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.
సనకనందన తీర్థం : పూర్వం సనకనందనాదులు సిద్ధిప్రాప్తి కోసం ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సును ఆచరించారు. దాంతో వారి పేరు మీదుగా ఇక్కడ తీర్థ స్థలం వెలిసింది. ఇందులో మార్గశిక శుక్లపక్ష ద్వాదశినాడు స్నానం చేస్తే సిద్ధి పొందుతారని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తర భాగంలో ఒక మైలు దూరంలో ఉంటుంది.
కుమారధార తీర్థం : ఇది దేవాలయానికి ఆరు మైళ్ల దూరంలో ఉంటుంది. మాఘ పౌర్ణమినాడు ఇందులో స్నానమాచరిస్తే సంతానం ప్రాప్తితోపాటు.. సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది.
తుంబుర తీర్థం : ఈ తీర్థం కూడా ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో ఉంది. పూర్వం ఇందులోనే తుంబురనాద మహర్షి ఘోరమైన తపమును ఆచరించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే దేవుని మీద భక్తి పెరగడంతో పాటు గతంలో చేసిన సకల పాపాలన్నీ దూరమవుతాయి.
నాగ తీర్థం : శ్రీహరి దేవాలయం నుంచి ఒక కిలో మీటరు దూరంలో ఈ తీర్థం కనువిందు చేస్తుంది. పెళ్లి కాని కన్యలు ఇందులో భక్తిశ్రద్ధలతో స్నానాలు చేస్తే సకల సద్గుణాలు కలిగిన ఉత్తమ భర్తను పొందుతారు.
చక్ర తీర్థం : భారతయుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురి కావడం వల్ల.. ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారు. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే.. వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు పూర్తిగా తొలిగిపోయి.. పునీతులు అవుతారు. శ్రీహరి ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంటుంది.
జాబాలి తీర్థం : పూర్వం జాబాలి అనే మహర్షి ఈ తీర్థంలో ఘోరమైన తపస్సు చేసి తరించారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే భూతప్రేత పిశాచాలు తొలగిపోవడంతో పాటు మనోవాంఛ కూడా సిద్ధిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. హథీరాంజీ మఠాధిపతుల ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి.. వారు నిత్యం స్వామి వారికి నైవేద్య ఆరాధనలు ఇస్తారు.
బాల తర్థం : ఈ తీర్థంలో స్నానం చేస్తే వృద్ధులు సైతం బాలురు శక్తిని పొందుతారని విశ్వాసం. అయితే ఇది సృష్టికి అవరోధం కావడంతో జలం కూడా కనిపించకుండా శిలలో మూసివేయబడింది. నాగ తీర్థం నుంచి రెండు వందల గజాల దూరంలోనే ఈ తీర్థం ఉంటుంది.
వైకుంఠ తీర్థం : కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఈ తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పురజనులు అప్పుడప్పుడు ఇక్కడ వైకుంఠ సమారాధన చేస్తూ ఉంటారు.
శేష తీర్థం : శ్రీహరి దేవాలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థానికి చేరుకోవడం చాలా కష్టం. పర్వతాలను ఎక్కుకుంటూ.. దారిలో ఉన్న చిన్న చిన్న ప్రవాహాలను చాలా జాగ్రత్తగా దాటాలి. ఈ ప్రవాహాలు కూడా పాచి పట్టి ఉంటాయి. ఈ తీర్థంలో ఆదిశేషుడు శిలారూపంలో దర్శనమిస్తాడు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నాగుపాములు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే వారికి మరోజన్మ ఉండదు.
సీతమ్మ తీర్థం : పూర్వం సీతాదేవి కుశలవులకు కరం నూరిపోసింది. బండ అరిగి ఉన్న కొంత భాగం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఒక బిలం కూడా ఉంది. అయితే అందులో ఉన్న జలం బయటకు కనిపించదు. ఇక పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి ఆ బిలంలో తోడితే.. నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు భక్తితో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే ముక్తిని పొందుతారు.
యుద్ధగళ తీర్థం : ఈ తీర్థం గురించి రామాయణంలో కూడా వర్ణించబడి ఉంది. పూర్వం రాముడు, రావణునిని సంహరించిన తరువాత తాను చేసిన బ్రహ్మహత్య మహాపాతకాన్ని నిర్మూలించుకోవడం కోసం ఇందులో స్నానం చేశాడు.
విరజా నది : శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహ పాదాల కింద భాగంలో ఈ నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒక చిన్న బావిలా కనిపిస్తుంది. స్వామి వారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంటుంది. ఈ తీర్థాన్ని తలపై వేసుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.
పద్మసరోవరం : పద్మావతి మందిరం దగ్గరున్న ఈ సరోవరం.. తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో ఉన్న జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ పద్మసరోవరంలో స్నానం చేసిన వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా.. భూతప్రేతపిశాచాలు కూడా వదిలిపోతాయి.
కేవలం ఇవి మాత్రమే కాదు... కాయరసాయ తీర్థం, ఫల్గుణి, కటాహ, వరాహ, విష్వక్సేన, పంచాయుధ, బ్రహ్మ, సప్తముని, దేవ తీర్థములు వంటివి ఎన్నో ముఖ్యత తీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.

Comments
Post a Comment