Skip to main content
భార్యే సూత్రధారి వివాహేతర సంబంధమే కారణం
హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడ ప్రాంతంలో గురువారం ఉదయం నరేశ్ ఆత్మహత్యాయత్నం కేసు సినీ ఫక్కీలో అనేక మలుపులు తిరిగింది. ఉదయం నుంచి ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారంలో చిక్కుముడి సాయంత్రానికి వీడింది. లాలాగూడలో నరేశ్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే తాను పోలీసులకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి ఉందని నరేష్ చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తనతో పాటు మరో ముగ్గురు కలిసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య చేసినట్లు నరేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మధ్యాహ్నం తర్వాత నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో పాటు, హత్య జరిగిన ప్రాంతాలకు నరేశ్ తీసుకెళ్లి నిర్ధారించుకున్నారు. చౌటుప్పల్ ప్రాంతంలో నాగరాజును నలుగురు నిందితులు కలిసి హత్య చేసినట్టు తేలింది. వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత భర్తతో కలిసి కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటోంది. ప్రియుడు కార్తీక్ ద్వారా భర్తను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నింది. అందుకు వ్యూహం రచించి ప్రియుడు కార్తీక్ అతని స్నేహితులతో కలిసి నాగరాజును హతమార్చారు. డిసెంబరు 31న నరేశ్, కార్తీక్, దీపక్‌తో పాటు మరో వ్యక్తి కలిసి నాగరాజును హత్య చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా నలుగురు నిందితులు జాగ్రత్త పడినా .. నరేశ్ సోదరుడికి విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. హత్య చేయడానికి ఎందుకు వెళ్లావు.. వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పేద్దామని నరేశ్ సోదరుడు వాదించాడు. దీంతో భయపడిన నరేశ్.. కేసు తన మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఉదయం లాలాగూడలో బ్లేడుతో గొతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాగరాజు హత్యకేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. నాగరాజు మృతదేహాన్ని పోలీసులు డిసెంబరు 31నే గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఇవాళ విషయం బయటకి పొక్కడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది.
Comments
Post a Comment