పండగ చేస్కో ''బాలయ్యో''

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'జైసింహా'. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార.. నటాషాదోషి.. హరి ప్రియ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. బాలయ్య మార్కు డైలాగ్‌లు పుష్కలంగా ఉన్నాయి. అభిమానులకు కావాల్సిన బాలయ్యమార్కును చూపిస్తూనే దర్శకుడు రవికుమార్‌ ఫ్యామిలీ డ్రామానూ పండించాడు. లవర్‌ బాయ్‌గా బాలయ్య కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా నయనతార పాత్రకే ప్రాధాన్యత కల్పించారు. మరోసారి నయనతార తన అందం..అభినయంతో మెప్పించింది. బాలయ్య..నయన తార కాంబినేషన్‌ మరోసారి హిట్‌ బాటపట్టింది. కథంలోకి వెళితే.. 
నరసింహ(బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త(మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే ఆ సమయంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) యాక్సిడెంట్‌ చేయడంతో ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల దాడి కూడా ఎక్కువవుతుంది. మరోవైపు ఏసీపీని ఎదిరించడంతో అతనికి కూడా శత్రువుగా మారతాడు. ఇదే సమయంలో గౌరి తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అప్పుడు నరసింహా కుంభకోణంలోని పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు. నరసింహకు గౌరికీ, సంబంధం ఏంటి? తెరపై చూడాల్సిందే. ఇది బాలకృష్ణ నటించిన మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. తొలి అర్ధభాగం కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ అభిమానులను ఆకట్టుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. దీనికి బాలకృష్ణ యాక్షన్‌ తోడవడంతో ఆయా సన్నివేశాలు రంజింపచేస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించి బాలకృష్ణ చెప్పే తీరు, పలికిన డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. మరోసారి బాలకృష్ణ తనదైన డ్యాన్సులతో అభిమానులతో ఈలలేయించారు. ముఖ్యంగా 'అమ్మకుట్టి' పాటలో స్టెప్‌లు ఆకట్టుకున్నాయి. కుంభకోణంలో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు ఫస్టాఫ్‌కు హైలైట్‌గా నిలిచాయి. దీంతో పాటు బ్రహ్మానందం కామెడీ నవ్వులు పూయిస్తుంది. ద్వితీయార్థం నయనతారతో ప్రేమ వ్యవహారం..ఫ్లాష్‌ బ్యాక్‌...ప్రకాష్‌రాజ్‌ సెంటిమెంట్‌ సీన్లు ఆకట్టుకున్నాయి. మొత్తంగా చూస్తే సంక్రాంతికి మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్యబాబు. తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అజ్ఞాత వాసి అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో జై సింహ జైత్రయాత్ర కొనసాగడంలో ఎటువంటి సందేహం లేదు.

Comments