ఆ రాత్రి ఏం జ‌రిగింది?

హైదరాబాద్:మెహదీపట్నంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కలకలం రేపుతోంది. హత్యకేసులో తనను ఇరికిస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో సాఫ్ట్‌వేర్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. లాలాగూడలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ప్రశ్నించగా అతడు చెప్పిన కొన్ని విషయాలు కీలకంగా మారాయి. డిసెంబర్ 31 రాత్రి దీపక్ అనే వ్యక్తిని హత్య చేశామని, ఈ హత్య కేసును తనపై వేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు.
న్యూఇయర్ వేడుకల్లో భాగంగా కొందరు స్నేహితులు సరదాగా బయటకు వెళ్లారు. అక్కడ ఒక అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ జరగడంతో ముగ్గరు యువకులు దీపక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను హత్య చేసి మృతదేహాన్ని సాగర్ కాలువలో పడేశారు. కాగా ఈ హత్య కేసును తనపై వేసేందుకు యత్నిస్తున్నారని భావించిన నరేష్ అనే యువకుడు లాలాగూడలో ఈ ఉదయం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరేష్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సాగర్‌లో దీపక్‌ మృతదేహాన్ని కనుగొనాల్సిందిగా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఓ మహిళ విషయంలో హత్య జరిగిన నేపథ్యంలో ఆమె వివాహితనా?..కాదా? అన్న విషయం తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments