హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరిగే అవకాశాలున్నాయి. ఒక్కరోజునే అన్ని పంచాయతీల పరిధిలోని వార్డుల్లో ఎన్నికల నిర్వహణలో ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విడతలవారీగా నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల సం ఘం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 8684 పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు లక్ష వార్డుల్లో ఒకే రోజున ఎన్నికలు నిర్వహించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, కొత్తగా మరికొన్ని పంచాయతీలు కూడా ఉనికిలో వస్తున్నందున వాటి పరిధిలోని పోలింగ్ బూత్‌ల సంఖ్య కనీసంగా ఇరవై వేలు పెరిగే అవకాశం ఉందని సంఘం అంచనా వేస్తోంది. ఒకేరోజున సుమారు ఒకటింపావు లక్షల పోలింగ్ కేంద్రా ల్లో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందికరమేనని, అందువల్ల కనీసంగా మూడు విడతల్లో నిర్వహించాలని సంఘం అధికారులు అభిప్రాయపడ్డారు. 1.20 లక్షల బ్యాలెట్ బాక్సులు తెలంగాణలో అందుబాటులో లేనందువల్ల పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలతో పాటు తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కూడా కొన్నింటిని తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల నుంచి ఇప్పటికే కొన్ని బ్యాలెట్ బాక్సులను తెప్పించి జిల్లా కేంద్రాల్లో పెట్టినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 70 వేల బాక్సులను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా పంచాయతీలు ఏర్పడినట్లయితే గెజిట్‌లో ఉన్న వివరాలు, వాటి భౌగోళిక స్థితిగతులను పరిశీలించి దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కొత్త పంచాయతీల్లో ఎన్ని వార్డులు ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పంచాయతీల కాలపరిమితి జూలై నెలతో ముగుస్తున్నందువల్ల ఎన్నికల నిర్వహణపై ఆరు నెలల ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రధానాధికారి నుంచి ఇంకా ఓటర్ల జాబితా అందలేదని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటి కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందే ఎన్నికలను నిర్వహించడానికి అవకాశం ఉన్నందున జనవరి నుంచి ఎప్పుడు ఎన్నికలు అనివార్యమైనా నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం సర్వసిద్ధంగా ఉంది. అయితే పంచాయతీ చట్టానికి సవరణలు జరగనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో గెజిట్ చేతికి అందిన తర్వాత దాని ప్రకారం బూత్‌ల ఎంపిక, సిబ్బందిని సమకూర్చుకోవడం, బ్యాలెట్ బాక్సులను తరలించడం తదితరాలపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో ఒక దఫా సమావేశం జరిగినట్లు వివరించారు. ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది మొదలు తొలి దశ పోలింగ్ నిర్వహణకు మధ్య 13 రోజుల సమయం అవసరమవుతుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నాలుగు రోజుల వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉంటుందని, ఆ తర్వాతి రోజు పరిశీలన, ఆ తర్వాత మూడవ రోజు వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజున తుది జాబితా సిద్ధమవుతుందని, తొలి దశ పోలింగ్ నిర్వహణకు కనీసంగా ఐదు రోజుల సమయం ఉండాలని పేర్కొన్నారు. అలా మొత్తంగా 13 రోజులు కనీసంగా అవసరమవుతుందని వివరించారు. ఫిబ్రవరి నెలాఖరుకు పంచాయతీ ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచిస్తున్నామని సిఎం కెసిఆర్ జిల్లాల కలెక్టర్ల సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించిందున 15వ తేదీ నాటికి గెజిట్ విడుదలకావడం, ఎన్నికల ప్రధానాధికారి నుంచి ఓటర్ల జాబితా అందడం, షెడ్యూలు విడుదల చేయడం తదితరాలు పూర్తికావాల్సి ఉంటుంది. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందువల్ల వాటి భౌగోళిక హద్దులు, వార్డుల సంఖ్య తదితరాలపై స్పష్టత రావడం, బిల్లు తయారుచేసి శాసనసభలో చర్చించి ఆమోదించడం, ఆ తర్వాత గవర్నర్ అనుమతితో గెజిట్ విడుదల కావడం ఒకదాని తర్వాత ఒకటిగా జరగాలి. అయితే సాధారణంగా ఎన్నికల నిర్వహణకు ముందు అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం అధికారులు (కమిషనర్) సమావేశాన్ని నిర్వహించి ప్రశాంత ఎన్నికలకు సహకారాన్ని కోరడం అనవాయితీ కాబట్టి ఫిబ్రవరి రెండవ వారంలో ఈ తరహా సమావేశం ఉండే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నందువల్ల ఇక ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడడమే తరువాయిగా సంఘం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు

Comments
Post a Comment