ఈ రైల్వే స్టేషన్‌లో అంతా ఆడవాళ్లే


 

అద్భుతంగా నడిపిస్తున్నారు 

లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్న మతుంగా రైల్వే స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే దేశంలోనే పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడుస్తున్న తొలి రైల్వేస్టేషన్‌. ఉద్యోగులంతా కలిసి ఈ స్టేషన్‌ను చక్కగా నడిపిస్తున్నారు. 
మహిళలు నడిపిస్తున్న తొలి రైల్వేస్టేషన్‌గా మటుంగా స్టేషన్‌ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుందని అధికారులు వెల్లడించారు. మహిళా సాధికారిత కోసం సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ డీకే శర్మ ఈ స్టేషన్‌లో అంతా మహిళా ఉద్యోగులను నియమించారు. భారత రైల్వేలో ఇదే తొలిసారి. అలా నియమించిన ఆర్నెళ్లలో ఈ స్టేషన్‌కు రికార్డుల్లో చోటు దక్కడం సంతోషంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘనత అంతా మహిళా ఉద్యోగులను నియమించిన డీకే శర్మకు దక్కుతుందన్నారు. మతుంగా స్టేషన్‌లో అన్ని విభాగాల్లో కలిపి 41 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్టేషన్‌ మేనేజర్‌ మమత కులకర్ణి ఆధ్వర్యంలో వీరు పనిచేస్తున్నారు. మహిళలు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వారంతట వారు నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహకర వాతావరణం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments