ఐపీఎల్‌ కాసుల వర్షం

ఐపీఎల్‌-2018 వేలంలో స్టార్‌ ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. ఈ ఐపీఎల్‌ వేలంలో కొన్ని సంచనాలు కూడా నమోదయ్యాయి. ఇదివరకే ఆయా జట్లు కొందరి ప్లేయర్లను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన వేలంలో ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాడి కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయి. ముఖ్యంగా 16 మంది స్టార్‌ ఆటగాళ్లను వేలంలో ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. వీరందరిలో హాట్‌ కేక్‌ ప్లేయర్‌ స్టోక్స్‌ ను రూ. 12.5 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 5.2 కోట్లకు దక్కించుకుంది. ఇక టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ను కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ రూ. 7.6 కోట్లకు కొనుక్కుంది. వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ను తిరిగి ముంబై ఇండియన్స్‌ రూ. 5.4 కోట్లకు సొంత చేసుకుంది. ఇక ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ ను కలకత్తా 9.4కోట్లకు, ప్రొటీస్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ చెన్నై జట్టు 1.6 కోట్లకు, టీమిండియా బ్యాట్స్‌ మన్‌ రహానే రాజస్థాన్‌ జట్టు 4.0కోట్లకు, మాక్స్‌ వెల్‌ ఢిల్లీ జట్టు 9కోట్లకు, విలియమ్‌ సన్‌ హైదరాబాద్‌ జట్టు 3 కోట్లకు, హర్భజన్‌ చెన్నయ్‌ జట్టు 2 కోట్లకు, యువరాజ్‌ పంజాబ్‌ జట్టు 2 కోట్లుకు, బ్రావో చెన్నై జట్టు 6.4 కోట్లకు, గంబీర్‌ ఢిల్లీ జట్టు 2.8 కోట్లకు, షకీబ్‌ అల్‌ హాసన్‌ హైదరాబాద్‌ జట్టు 2 కోట్లకు దక్కించుకున్నాయి. 
'బెన్‌ స్టోక్స్‌'కు 12.50 కోట్లు 
ఐపీఎల్‌ వేలంలో స్టార్‌ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కు జాక్‌ పాట్‌ తగిలింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు స్టోక్స్‌ ను 12.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గత ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ. 14.50 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్‌ ఈ సంవత్సరం అంత ధర పలకలేదు. రూ. 12.5 కోట్లకే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కొనుక్కుంది. మరోవైపు వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు, ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ కు ఐపీఎల్‌ వేలంలో ఊహించని షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ కు జరుగుతున్న వేలంలో క్రిస్‌ గేల్‌ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ముందుకు రాలేదు. గత కొంత కాలంగా బెంగళూరు జట్టుకు క్రిస్‌ గేల్‌ ఆడిన విషయం తెలిసిందే.

Comments