జపాన్‌లో బీభత్సం సృష్టించిన సునావిూ విధ్వంసం నుంచి నీటిపై తేలియాడే కారు ఆలోచన రూపు దిద్దుకుంది. 2011 మార్చి 11వ తేదీన జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో సునావిూ రాకాసి అలలు విరుచుకుపడుతుంటే అక్కడ నుండి బయటపడేందుకు ప్రజలు కార్లలో పెద్ద సంఖ్యలో వెళ్ళిపోవడం చూసిన హిడెయొ సురుమాకి అనే వ్యక్తికి ఈ ఆలోచన వచ్చింది. సురుమాకి టయోటా మోటార్ కార్పొరేషన్ సంస్థ మాజీ ఉద్యోగి. కార్లలో ప్రజలు వెళుతున్నా అలల తాకిడికి నెమ్మదిగా ఆ కార్లు కూడా మునిగిపోవడం చూసిన సురుమాకికి తన తల్లి గుర్తుకు వచ్చింది. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలోనే జీవించే ఆమె ఆ రోజున మిగిలిన వారిలా అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నడవలేకపోయింది. నీటిపై తేలియాడేలా కారు వుంటే కొద్దిమందైనా బతికి వుండేవారేమో అని సురుమాకి అనిపించింది. రెండేళ్ళ తర్వాత ఆయన ఒక చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. అది వరదనీటి లో కూడా ప్రయాణించగలదు. ఆయనకు వచ్చిన ఆలోచనను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో పెట్టబోయే ఫ్యాక్టరీలో ఏడాదికి 10వేల కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. 2020 నాటికి ఈ కంపెనీ వాటాలను ప్రజలకు విక్రయించాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఇదొక చిన్న ఎలక్ట్రిక్ వాహనంగా పరిగణిస్తున్నప్పటికీ సంపన్న కుటుంబాలు తమ చుట్టుపక్కల ప్రాంతాలకు తక్కువ దూరం వెళ్ళొచ్చేందుకు ఉపయోగపడు తుందని భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా నీటిపై తేలే సామర్ధ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం, అవసరం వస్తుందని ఆయన పేర్కొన్నారు.



Comments
Post a Comment