పుస్తక పఠనం మంచి అలవాటు. ఈ విషయాన్ని మేధావులు ఎప్పుడో స్పష్టం చేశారు. టీవీ అదే పనిగా చూసే కంటే మంచి పుస్తకాలు చదవడం ఎంతో ఆరోగ్యకరం. తరచూ టీవీ చూడడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎటూ కదలకుండా సరికొత్త ఊహాప్రపంచంలోకి పయనించేందుకు పుస్తక పఠనం ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలకి మంచి పుస్తకాలు చదివించే అలవాటు తల్లిదండ్రులే చేయాలి. మనం అన్ని విషయాల్లోను పాశ్చాత్య శైలిని ఇష్టపడతాం. కానీ అక్కడి తల్లిదండ్రులు పిల్లలకు మంచి పుస్తకాలు కొనిపెట్టేందుకు తమ నెలవారీ బడ్జెట్‌లో పెద్ద మొత్తమే ఖర్చు చేస్తుంటారని తెలుసా? ఈ మంచి లక్షణాన్ని మాత్రం మనం అలవరచుకోము. సాధారణ పాఠ్య పుస్తకాల కంటే కథల పుస్తకాలు, విజ్ఞానాన్ని బోధించే పుస్తకాలు, స్పేస్, ఓషన్, ఎడారుల గురించి తెలిపే పుస్తకాలు, ఇంకా ఇతర పుస్తకాలు పిల్లల్లో జిజ్ఞాసను పెంపొందించడమే కాకుండా, వారికి ఆయా విషయాలపై పట్టు పెరిగేలా దోహదపడతాయి. కనుక పుస్తకాలు చదివించడం పిల్లలకు మేలే చేస్తుందని చెప్పాలి. అటువంటి పుస్తకాలు తేలికైన చిన్నచిన్న పదాలు, అందమైన బొమ్మలతో ముద్రించి ఉండడం వల్ల విషయం పిల్లలకి ఇట్టే అర్థమవుతుంది. అది వారికి కలకాలం గుర్తుండిపోతుంది. చక్కటి భాష, వ్యక్తీకరణ ఉండేలా పుస్తకాలను ఎంచి కొని పిల్లలతో చదివించాలి. ప్రముఖ ప్రచురుణ సంస్థలు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటాయి గనుక కాస్త ఖరీదు ఎక్కువే అయినా అటువంటి పుస్తకాలు కొని పిల్లలతో చదివింపజేయాలి. ఒక పుస్తకం పూర్తిగా చదివి, అందులోని విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. అటువంటి అనుభూతి పిల్లలకి కలిగేలా చూడాలి. దానివల్ల వారు మరిన్ని పుస్తకాలు చదివేందుకు, పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. తొలుత చిన్నచిన్న పుస్తకాలు చదివిస్తూ, వారు అవి పూర్తి చేసిన తర్వాత కాస్త పెద్దవి చదివేలా ఏర్పాటు చేయాలి. పుస్తకాలు చదువుతూ, వారు మరింత నేర్చుకుంటూ ముందుకు సాగేలా తగిన జాగ్రత్త వహించాలి. పరీక్షల సీజన్ వస్తోంది. అది పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో వారితో మంచి మంచి పుస్తకాలు చదివించే పని పెట్టుకోవాలి. అలాగే పుస్తకాల్లో కొత్త పదాలు వచ్చినప్పుడు, అవి వారికి తెలియనప్పుడు వాటిని అండర్‌లైన్ చేయడాన్ని అలవాటు చేయాలి. ఆ పదాలకు సరైన అర్థాలను పెద్ద వారిని అడిగి తెలుసుకునేలా అలవాటు చేస్తే పిల్లల విషయ పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. చదువులో ఇట్టే రాణించగలుగుతారు. పెద్దలు పిల్లల్ని గ్రంథాలయాలకు, పుస్తకాల దుకాణాలకు, పుస్తక ప్రదర్శనలకు తరచూ తీసుకెళ్లినట్లయితే వారికి చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. అది వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇదేమంత ఖర్చుతో కూడుకున్న పని కాదు. కాకపోతే పిల్లల్ని టీవీ చూసే అలవాటు మానిపిస్తేనే ఇదంతా సాధ్యం అవుతుంది. ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేస్తే పిల్లలు మంచి పుస్తకాలు చదివే అలవాటును ఇట్టే అలవరచుకుంటారు.

Comments
Post a Comment