అమరావతి : విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-1, 2ల్లో చేపట్టాల్సిన విజయవాడ బైపాస్, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిలకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేసేందుకు టెండర్లు పిలవడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) రంగం సిద్ధం చేస్తోంది. ఈనెలలోనే డీపీఆర్ తయారీ కోసం నేషనల్ హైవే అధికారులు కన్సల్‌టెంట్లను ఆహ్వానించడానికి టెండర్లను పిలవనున్నారు. రోడ్డుకు డీపీఆర్ తయారు చేయడానికి ఈజీఐఎస్ సంస్థను నియమించారు. ఆ సంస్థ అందుకు సంబంధించి ప్యాకేజీ - 1, 2, 3, 4 లుగా చేపట్టేందుకు నివేదిక తయారు చేసి పంపింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు ప్యాకేజీ -1, 2ల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి మళ్లీ డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్యాకేజీ - 1 లో భాగంగా కృష్ణానదిపై నిర్మించాల్సిన నాలుగులేన్ల వంతెనను రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు ఐకానిక్‌గా ఆరు వరసలతో, విజయవాడనుంచి పెద అవుటపల్లి వరకు 48 కిలోవిూటర్ల దూరం లో నాలుగు లేన్ల రోడ్డును ఆరులేన్లుగా నిర్మించడానికి సరికొత్త డీపీఆర్ తయారు చేయించాలని ఎన్‌హెచ్ నిర్ణయించింది. మొదట్లో అదనపు పనులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించినా ప్రస్తుతం కేంద్రం ఈ మొత్తాన్ని భరించాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ పార్ట్-2 పనులకు టెండర్లు ఈనెలలోనేబెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ పార్ట్-2 పనులకు టెండర్లు పిలవడానికి నేషనల్ హైవేస్ అధికారులు ఈ నెలలోనే రంగం సిద్ధం చేస్తున్నారు. పార్ట్-1ను రూ.85 కోట్లతో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 25 శాతం పనులు కూడా జరిగాయి. రెండో వైపు సమాంతరంగా నిర్మించాల్సిన ఫ్లై ఓవర్‌కు ఇటీవల ఆర్వీ అసోసియేట్స్ రూ.110 కోట్లతో డీపీఆర్‌ను తయారుచేసి ఢిల్లీకి పంపారు. ఢిల్లీలోని ఎన్‌హెచ్ అధికారులు ఈనెలలోనే టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Comments
Post a Comment