జగన్..మొండితనానికి మారుపేరు. ఎందుకంటే..ఓ పక్క వైద్యులు వద్దన్నా పాదయాత్ర మానడం లేదు. హైఫీవర్, జలుబుతో బాధపడుతున్నారు. పాదయాత్ర ఆపి రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాద యాత్ర చేయాల్సిందేనని జగన్ చెబుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు జ్వరాన్ని సైతం లెక్క చేయనని చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా సరే ప్రజల వద్దకు వెళుతున్నారు. ఇప్పటికి 900 కిలోమీటర్లు పూర్తి చేసిన జగన్..వేల మంది ప్రజల కష్టాలు, బాధలు విన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లె వద్ద జగన్ 900 కిలోవిూటర్ల మైలురాయిని దాటారు. గత ఏడాది నవంబర్ నెలలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో జగన్ పాదయాత్ర ఆరంభం అయిన సంగతి తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల విూదుగా సాగిన జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. ఈ పాదయాత్రలో జగన్ ఇప్పటి వరకూ సుమారు 27 అసెంబ్లీ నియోజకవర్గాలను దాటుకుని వచ్చారు. కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి వద్ద జగన్ పాదయాత్ర వంద కిలోవిూటర్లను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అదే జిల్లాలోని డోన్ వద్ద రెండు వందల కిలోవిూటర్ల మైలురాయిని దాటారు జగన్. ఆ పై డోన్ వద్ద మూడువందల కిలోవిూటర్ల మైలురాయిని, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో నాలుగువందల, ఆ జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో ఐదువందల, కదిరి నియోజకవర్గంలో ఆరువందల, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఏడువందల, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఎనిమిది వందల కిలోవిూటర్ల మైలురాళ్లను దాటారు జగన్. ప్రతి వంద కిలోవిూటర్ల మైలురాయిని దాటి చోటళ్లా జగన్ ఒక చెట్టును నాటుతూ వస్తున్నారు. పాదయాత్రలో జగన్ ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శల జోరు పెంచుతున్నారు. చంద్రబాబు పాలనతో ఎవ్వరూ సంతోషంగా లేరనే మాటను చెబుతున్నారు. తమ ప్రభుత్వం వస్తే అమల్లోకి తెచ్చే 'నవరత్నాల' గురించి జగన్ వివరిస్తూ వస్తున్నారు.

Comments
Post a Comment