660 సంవత్సరాలు..1355 ఊడలు

                                                  తిమ్మమ్మ మర్రిమాను వృక్ష విశేషాలు

'తిమ్మమ్మ మర్రిమాను' గురించి విన్నారా? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35.కి.మి.దూరంలో గూటిబయలు గ్రామంలో ఈ మర్రిమాను ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద వృక్షంగా పేరుగాంచిన ఈ చెట్టు.. దాదాపు 5 చదపరపు ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి వుంది. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఈ చెట్టుకు 'తిమ్మమ్మ' అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. అలా ఎందుకు పెటాల్సి వచ్చింతో ఓ కథనం కూడా ప్రచారంలో వుంది. 
బుక్క పట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతులకు తిమ్మమాంబ అనే కుమార్తె ఉండేది. గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో తిమ్మమాంబకు వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి సంసార జీవితం బాగానే కొనసాగింది. అయితే.. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. ఆ రోజుల్లో సతీసహగమనం ఆచారం కొనసాగుతుండేది కాబట్టి.. భర్త మరణంతో తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధమైంది. అప్పుడు చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి కట్టెలు నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ.. చిగురించి అది మహావటవృక్షంగా ఎదిగింది. అందుకే.. ఈచెట్టుకు 'తిమ్మమ్మ' అనే పేరు పెట్టారు. ఈ చెట్టును ప్రపంచపుటల్లో స్థానం కల్పించేందుకు 1989లో సత్యనారాయణ అరియర్స్‌ అనే వ్యక్తి ఎంతో కృషిచేశారు. ఆయన తీసుకున్న కృషితోనే ఈ చెట్టు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కింది. 1355 వూడలతో వుండే ఈ మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి. 
అనంతపురం జిల్లాలో నీటి కొరత ఎక్కువగా వున్నప్పటికీ.. తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో చూపరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. మర్రిమానును 1992లో అటవీశాఖ అధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్‌ నిర్మించారు. 
ఈ చెట్టు కింద 'తిమ్మమ్మ' గుర్తుగా చిన్న గుడి వుంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద 'తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప. మంగమ్మలకు జన్మించింది. 1434లో సతీసహగమనం చేసింది' అని చెక్కబడింది. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వల్ల పిల్లలు కలుగుతారని భక్తులు భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ వృక్షము పై ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతేకాదు. సాయంత్రం ఆరుగంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టుపై ఉండవట.!

Comments