అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు

ఎస్‌..మీరు చదివింది నిజమే...మద్యానికి మగవాళ్లే బ్రాండ్‌ అంబాసిడర్లు అనుకుంటే పెగ్‌లో కాలేసినట్టే...స్టఫ్‌లో బోర్లాపడ్డట్టే. ఎందుకంటే ఇప్పుడు మహిళలూ ఈ తాగుడు రంగంలో మగవాళ్లకు పోటీగా నిలుస్తున్నారు. ''వై షుడ్‌ బాయ్స్‌ హావ్‌ ఆల్‌ ఫన్‌?'' అంటూ ఒక హీరోయిన్‌ టీవీ ప్రకటనలో అడిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ప్రశ్న నిజానికి వినడానికి చాలా సింపుల్‌గా అనిపించి ఉండొచ్చు. కానీ.. అదే ప్రశ్నను చాలామంది మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారేమో? మద్యం మగవాళ్లే ఎందుకు తాగాలి? తాము ఎందుకు తాగకూడదు? అనే వాదన ప్రస్తుత కాలంలో మగువల నుంచి తరచూ వినపడుతోంది. ప్రశ్నించడమే కాదు దానిని ఆచరించి చూపిస్తున్నారు. 
ఎంతలా అంటే.. మైనర్లు, కాలేజీ యువతులు.. మద్యపానం, ధూమపానాలకు విపరీతంగా అలవాటు పడుతున్నారు. కొన్ని సినిమాల్లో అమ్మాయిలు మద్యం తాగడం, సిగరెట్లు తాగడం లాంటివి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆ అదంతా సినిమా.. నిజం కాదు అని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉంటారు. కానీ నిజంగా బయట ప్రపంచంలో జరిగే వాటినే సినిమాల్లో చూపిస్తున్నారు. సినిమాలు చూసి యువత పాడైపోతుందని వాదించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ.. బయట జరుగుతున్న దానినే తాము సినిమాల్లో చూపిస్తున్నామని సినిమా వాళ్లు చెబుతున్నారు. ఎవరు ఏది చెప్పినా.. ప్రస్తుతం ఆడపిల్లలు మాత్రం మద్యానికి విపరీతంగా అలవాటు పడుతున్నారనేది వాస్తవం. చదువు, ఉద్యోగాల కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసేవాళ్లు.. పబ్‌ కల్చర్‌కు అలవాటు పడి మద్యం, సిగరెట్లకు బానిసలౌతున్నారు. పని ఒత్తిడి, విపరీతమైన స్వేచ్ఛ ఇందుకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Comments