కొండంత జనం

తిరుమల కిటకిట
తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. వేకువజామున 5గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ దాదాపు 4 గంటల పాటు వీఐపీ సేవలో తరించింది. దాదాపు 3,575 పాస్‌లను వీఐపీలకు మంజూరు చేసింది టీటీడీ. ఉదయం 8గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతివ్వడంతో గత అర్ధరాత్రి 12 గంటలకు క్యూలైన్లో ఉన్న భక్తులు ప్రస్తుతం స్వామివారిని దర్శించుకుంటున్నారు. 
స్వామి వారి దర్శనార్ధం భక్తులు భారీగా తరలివస్తుండటంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులతో ఉన్న క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపలి క్యూలైన్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు కిలోవిూటర్ల క్యూలైన్లు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో భక్తులను టీటీడీ ఔటర్‌ రింగ్‌రోడ్డు వైపు మళ్లించింది. 
ఈ క్రమంలో రేపు ఉదయానికి గానీ భక్తులకు స్వామిదర్శనం లభించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి వీఐపీలను కట్టడి చేస్తామన్న టీటీడీ దాదాపు 4 గంటల పాటు వీఐపీలకు బ్రేక్‌ దర్శనం కల్పించింది. 
దీంతో దర్శనం ఆలస్యం అవడంతో లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రింగ్‌ రోడ్‌ ప్రాంతంలో భక్తుల మద్య తోపులాటలు చోటు చేసుకోవడంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.ఒక్కసారిగా లక్షలాదిమంది భక్తులు రావడంతో వారిని అదుపుచేయలేక భద్రతా సిబ్బంది సతమతమవుతున్నారు.

Comments