మత్తుతో భాగ్యనగరం

హైదరాబాద్‌ను మత్తు ఊపేస్తుంది. మామా ఏక్‌ పెగ్‌లా కాదు మామా ఏక్‌ డ్రగ్‌ లా అంటూ మత్తుతో చిత్తు చేస్తున్నారు. రోజురోజుకూ భాగ్యనగరంలో మాదకద్రవ్యాల సేవనం పెరుగుతోంది. సిటీ కేంద్రంగా కోట్లాది రూపాయల డ్రగ్స్‌ దందా సాగుతోంది. ఇక డిసెంబర్‌ థర్డీ ఫస్ట్‌ అయితే, సిటీలో మందే కాదు, డ్రగ్స్‌ సేవనం ఓ రేంజ్‌లో సాగిపోతుంది. పబ్‌లు, క్లబ్‌లు, హుక్కా సెంటర్లు, శివారుల్లో రేవ్‌ పార్టీలు మత్తు మానియాతో ఊగిపోతుంటాయి. ఇదిగో న్యూఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేసేందుకు సిద్దమైన నైజీరియన్‌ ముఠాను, తాజాగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌కి సరిగ్గా మూడ్రోజుల ముందు హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. గతంలో ఎప్పుడూ దొరకని విధంగా ఈసారి ఏకంగా 225 గ్రాముల కొకైన్‌ పట్టుబడటం పోలీసులనే విస్మయపరిచింది. ప్రధాన నిందితుడు జాన్‌ చిక్కూతో పాటు బెర్నార్డ్‌ విల్సన్‌, లుకాస్‌లను అదుపులోకి తీసుకున్న వెస్ట్‌జోన్‌ పోలీసులు వాళ్లను విూడియా ముందు ప్రవేశపెట్టారు. 
హైదరాబాద్‌లో 250 గ్రాముల కొకైన్‌ పట్టుబడటం ఇదే తొలిసారని పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు అన్నారు. పట్టుబడిన కొకైన్‌ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి 250 గ్రాముల కొకైన్‌, 25 గ్రాముల హెరాయిన్‌, రెండు ల్యాప్‌ ట్యాప్‌లు, 10 సెల్‌ఫోన్స్‌, 30 చాక్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 900 గ్రాముల కొకైన్‌ను పట్టుకున్నట్లు చెప్పారు సీపీ శ్రీనివాసరావు. చదువుకోవడానికి రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌కి వచ్చిన ప్రధాన నిందితుడు జాన్‌ చిక్కూ.... మరో నైజీరియన్‌ బెర్నార్డ్‌ విల్సన్‌తో కలిసి డ్రగ్స్‌ దందా మొదలుపెట్టాడని సీపీ తెలిపారు. వీళ్లిద్దరికీ మరో నిందితుడు లుకాస్‌ జత కలిశాడు. ఈ ముగ్గురూ కలిసి ముంబై నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ తీసుకొస్తుండగా పట్టుబడ్డారు. సౌతాఫ్రికా, నైజీరియా నుంచి తక్కువ ధరకు కొకైన్‌, ?హెరాయిన్‌ను కొనుగోలుచేసి... ఇండియాలో ఒక్కో గ్రామును 570 డాలర్లకు విక్రయిస్తున్నారు. 
డ్రగ్స్‌...హైదరాబాద్‌కో, గోవాకో, అమెరికాకో పరిమితమైన సమస్య కాదు, ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. దీని బారినపడి ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. మరెన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు...అభివృద్ది చెందిన దేశాలకే పరిమితమైన ఈ వ్యసనం, ఇప్పుడు చాపకింద నీరులా ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించింది. ఇక చేతినిండా డబ్బు, పబ్బులు, రేవ్‌ పార్టీలు, విలాసాల మత్తులో జోగే సినీ జీవులు, సంపన్న యువత డ్రగ్స్‌ వ్యసనం అనే ఊబిలో చిక్కుకుపోతున్నారు. 
మొన్నటిమొన్న సినీలోకం మత్తులో ఎంతగా జోగిపోతోందో కళ్లారా చూశాం. కేవలం తారలనే కాదు, కెల్విన్‌ ముఠా, స్కూళ్లనూ టార్గెట్‌ చేసింది. నైజీరియన్‌ గ్యాంగ్‌తో చేతులు కలిపి, భాగ్యనగరాన్ని మత్తుతో ముంచెత్తిన వైనం చూసి అవాక్కయ్యాం. కానీ ఇప్పటికీ నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠాకు మాత్రం పోలీసులు కళ్లెం వేయలేకపోతున్నారు. చదువులు, వైద్యం, టూరిజం ఇలా ఏదో ఒక పేరుతో ప్రతిఏడాది భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు నైజీరియన్లు. కొందరు పేరుకు చదువైనా, డ్రగ్స్‌ విక్రయించడమే వారి లక్ష్యం. ముఖ్యంగా సినీ తారలు, సంపన్న యువత, కాలేజీ కుర్రాళ్లు, చివరికి స్కూల్‌ పిల్లలనూ టార్గెట్‌ చేస్తున్నారు. ఇక న్యూఇయర్‌ వంటి సెలబ్రేషన్స్‌ టైంలోనైతే, పెద్దమొత్తంలో కొకైన్‌, హెరాయిన్లను సిటీలో వెదజల్లుతున్నారు. 
నైజీరియన్‌ లాంటి ఆఫ్రికా దేశాలనుంచి వచ్చిన విద్యార్థులపై నిఘాను పెంచుతామని పోలీసులు చెప్తున్నా..అది ఆచరణలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. నగర శివారు ప్రాంతాల్లోని మందుల తయారీ కంపెనీల్లో ఈ వ్యవహారం జరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సైంటిస్టు రామారావు, వైమానికదళం వింగ్‌ కమాండర్‌ రాజశేఖర్‌రెడ్డిలు కూడా నగర శివారులైన ఐడీ బొల్లారం, బాచుపల్లి వంటి ఏరియాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తయారు చేసినట్టు విచారణలో తేలింది. శివార్లలో మరింత నిఘా పెంచాల్సి ఉంది. 
గతంలోనూ హైదరాబాద్‌ పోలీసులు, నైజీరియన్‌ డ్రగ్‌ మాఫియా ముఠాలను అరెస్టు చేశారు. కానీ వాటి మూలాలను మాత్రం పట్టుకోలేకపోతున్నారన్న విమర్శ ఉంది. ఇప్పటికైనా పోలీసులు, ఎవరి ప్రభావాలకూ లోనుకాకుండా దోషులపై ఉక్కుపాదం మోపాలి. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. యూత్‌కు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. స్కూళ్లు, కాలేజీలపై నిఘా పెంచాలి. డిసెంబర్‌ థర్డీ ఫస్టు సందర్భంగా రేవ్‌ పార్టీలు, పబ్‌లు, హుక్కా సెంటర్లపై ప్రత్యేక దృష్టిపెట్టి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయాలి. హైదరాబాద్‌ను డ్రగ్‌ ఫ్రీ సిటీగా మార్చాలి. ఇలా ఎన్నో చర్యలు పకడ్బందీగా అమలు చేస్తేనే కానీ, హైదరాబాద్‌ను డ్రగ్‌ ఫ్రీ సిటీగా చూడలేం.

Comments