చిరునవ్వులు చిదిమేసిన బస్సు

  •  ఫిరంగిపురం వద్ద ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • నలుగురు చిన్నారులు, ఆటో డ్రైవర్‌ మృతి 
  • మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు 
గుంటూరు
అంటూ ఆ చిన్నారులు ముద్దులొలికే మాటలతో స్కూల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు 
తమ చిన్నారులను నవ్వుతూ సాగనంపిన తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త వింటారని ఊహించలేదు. 
స్కూలుకు వెళ్లిన కొద్దిసేపటికే ఆటోను బస్సు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆటోను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో విషాదం నెలకుంది. వేమవరం గ్రామం నుంచి పేరేచర్లలో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆటో ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ఆటోలను ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వద్ద పొన్నూరు నుంచి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలోని నలుగురు పదో తరగతి విద్యార్థులు, ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఆటోలో మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని గుంటూరు జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీహరి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి లచ్చన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్న లలిత ఆస్పత్రికి మంత్రి నక్కా ఆనందబాబు చేరుకున్నారు. తమ కంటిరెప్పలు ఇలా విగత జీవులుగా మారిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయ్యో దేవుడా ఎందుకిలా చేశావ్‌ అంటూ రోదించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా విషాద వాతావరణం నెలకుంది.

Comments