భారతీయ వేదం...సార్వజనీనం
-సద్గురు శివానందమూర్తి
యోగము - సాధనామార్గము, శక్తి - సాధింపదగిన వస్తువు, ఫలము - ముక్తి. ఇట్టి మార్గాన్ని అనుసరించే వారిని శాక్త మతస్థులు అంటారు. ఈ శాక్తమార్గము బాహ్యపూజ, అంతరంగ సాధన అనే రెండు మార్గములను అనుసరిస్తుంది. అంతరంగ సాధన, ప్రాణాయామ ప్రత్యాహారాదులతో కూడిన హఠయోగమనే మార్గాన్ని అనుసరిస్తుంది. ప్రధానంగా తపస్సుకు, జ్ఞానానికి అడ్డువచ్చేటటువంటి సర్వ విషయాలకు శరీరమే స్థానము. కాని సర్వతపస్సులకు, ఈశ్వరదర్శనానికి, ముక్తి సాధనకు, జీవాత్మకు పనికి వచ్చే సాధనం కూడా శరీరమే. కనుక ఆధ్యాత్మిక సాధనలో ఉత్తమ స్థితికి వెళ్ళడానికి ఈ శరీరాన్నే వాడుకుంటూ, దాంట్లో ఉండేటటువంటి, అట్టి సాధన మార్గానికి అవరోధాలను - ఈ శరీరమందున్న వాటిని తొలగించ ుకోవడం అనేదే అతి ముఖ్యమైనటువంటి కార్యము. శరీరములో ఇంద్రియాలకు సంబంధించిన ఏ విషయాన్ని తీసుకున్నా, అది తనవశమై ఉంటే సాధకుడికి సేవ చేస్తుంది. లేకపోతే, సాధకుడు దాని వశమైతే, ఏ సిద్ధీలేక ఈ జన్మ వ్యర్థమౌతుంది. సృష్టి ప్రారంభ కాలం నుండి అందరి చరిత్ర కూడా ఈ శరీర మందున్న అంతర్గత శక్తులను వినియోగించుకొని, తపస్సిద్ధి అనే ఈశ్వర దర్శనాన్ని సాధించి, లోకమందు ప్రసిద్ధులు కావటమో, లేక ఆ తపోమార్గంలో ఉండగానే ఈ అంతరంగ- అనగా ఇంద్రి యములలో ఉండే శక్తిప్రభావానికి లొంగిపోయి, తపోమార్గంలో పరాజితులు కావడమో - ఈ రెండే మన చరిత్రగా కనబుడుతోంది.
ఆర్యధర్మంలో ప్రతి జీవునికీ ధ్యేయము, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో అట్టి కారణమైన పరమేశ్వరుడిని చేరుకోవడ మేనని అందరూ ఒప్పుకున్నదే. దీనికి అవసరమైనటువంటి సిద్ధాంతములలో గాని, మార్గోపదేశాలలోకాని అనేక విభేదాలు ఈ వేద సంస్కృతిలో ఉన్నాయి. కాని అందరికీ తపస్సనేది అభిప్రాయ భేదంలేని మార్గమే. యోగశాస్త్రం, ఈ తపస్సు యొక్క విధాన్ని, దాని వెనుక ఉన్న సిద్ధాంతాన్ని వివరించడం చేత అందరికీ దీనియందు మాత్రం అత్యంత గౌరవం ఉన్నది. దీనికి నిదర్శనము, వేద వ్యాసుడు పతంజలి యోగసూత్రాలకు భాష్యము వ్రాయడం మాత్రమే.
ఆయన స్వయంగా బ్రహ్మసూత్రాలకు కర్తే అయినప్పటికీ - తపస్సు యొక్క విధి విధానాలను గురించి చెప్పిన శాస్త్రం కావడం చేత - యోగశాస్త్రానికి మాత్రం ఆయన అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చి, స్వయంగా దాని మీద భాష్యం వ్రాశారు. ఆయనకు ఒక మతమంటూ ఉంటే, అది ప్రతి జీవుడూ ఏ మార్గంలోనైనప్పటికీ కూడా, ఈశ్వరుని చేరుకోవాలని చెప్పడమే. నిర్గుణమైన పరబ్రహ్మమును ప్రతిపాదిస్తూ, బ్రహ్మసూత్రాలు వ్రాసిన ఆ వ్యాసుడే, విష్ణు యొక్క పారమ్యాన్ని చెప్తూ విష్ణుపరంగా కొన్ని పురాణాలు, శివునియొక్క మహత్తు చెప్పుతూ కొన్ని పురాణాలు, పరాశక్తి అనే దేవి యొక్క మహత్తు చెప్తూ దేవీ భాగవతము, ఇట్లాగే, శివ-శక్తి సమ్మేళనమైన సుబ్రహ్మణ్యుడనే స్కందుని చరిత్ర, మహత్తు చెప్తూ స్కందపురాణం వ్రాశాడు. అంతేకాక, భగవంతుని యొక్క లీలలను విష్ణుపరంగానూ, తన కాలం నాటి అవతారమైన శ్రీకృష్ణపరంగానూ, భక్తిభావాన్ని మనలో అంకురింపచేసే విధంగా శ్రీకృష్ణ భాగవతాన్ని కూడా వ్యాసుడే వ్రాశాడు.
విభిన్న రుచులు కల్గిన లోకానికి ఎవరైనా ఇష్ట దైవం కావచ్చు. కాని, అట్టి దైవము ఇతర దేవతల నుంచి పూర్తిగా భిన్నమైనటువంటిదీ, ఎక్కువైనటువంటిదీ కాకూడదు. ఎందుకంటే, రూపలక్షణ కార్యాలు వేరైనా, వీరందరూ మౌలికంగా పరమసత్యమైన పరబ్రహ్మమే తత్త్వంగా కలిగిన వారు. అట్లాకాకపోతే, వారెవ్వరూ సంపూర్ణులు కాలేరు. మోక్షాన్ని ఇవ్వలేరు. ఈ విషయాన్ని అన్ని పురాణాల్లో వ్యాసుడు 'నీవే పరమేశ్వరుడవు' అని ప్రతి దేవతారూపాన్నీ స్తోత్రం చేస్తూ మనకు బోధించాడు. అయితే, పూజా విధానములలో, ఉపాసనలో ఈ శివకేశవాదులకు తేడా ఉంటుంది. ఇది వారి రూపలక్షణాదులకు ఉన్న భేదం వంటిదే. మంత్రశాస్త్ర విషయానికి వచ్చేటప్పటికి ప్రతిదేవతా వేరువేరుగానే ఉండి ఉంటుంది. ఈ అర్థంలో పరాశక్తికి కూడా అనేక నామాలూ, రూపాలూ ఉన్నాయి. మహాలక్ష్మి మహాకాళి కాదు. రాజరాజేశ్వరి దుర్గకాదు. దుర్గ సరస్వతీ కాదు. ఇలాంటి విభిన్నమైన రూపములు, మంత్రములు, యంత్రములు కలిగిన పరాశక్తి యొక్క దేవీరూపములు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మన భారతీయులు సమానమైన ప్రతిపత్తితో, గౌరవంతో, భక్తితో ఉపాసన చేశారు. వీరందరికీ కూడా, ఇన్ని రూపములు కూడా ఒకానొక పరాశక్తివే అన్న జ్ఞానం స్థిరంగా ఉంది. దీనివల్ల వేయి విధములుగా విస్తరించిన శైవ, వైష్ణవ, శాక్తాది మతములన్నీ కూడా ఆర్య సంఘాన్ని విభజించలేదు. వారి సమైక్యత యందు ఎట్టి కొరతా రాలేదు. నిన్న మొన్నటి వరకు మన స్థితి ఇట్టిదే.
కాని సనాతనమైన బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు ఆదిశంకరలు(క్రీ.శ.9వ శతాబ్దమువాడని అంటారు) అద్వైత బ్రహ్మపరమైన వ్యాఖ్యానాలు వ్రాసిన క్షణం నుంచి ప్రబలమైన వాదోపవాదాలు, ఖండన మండనాలు ప్రారంభమై, వందలాది గ్రంథములు పుట్టడం జరిగింది. తీవ్ర స్వభావులైన కొందరు, ఈ మతములలో విభేదాన్ని చాలా పెద్దది చేసి, పరస్పరద్వేషం వరకూ సంఘాన్ని తీసుకెళ్లారు.
ఇదంతా నిన్న మొన్నటి చరిత్రగా భావించాలేకాని, పూర్వయుగాల నుంచి వస్తున్న విభేదాలుగా పరిగణించకూడదు. ఇట్టి మతభేదాలు సృష్టించబడినప్పటికీ, సామాన్య ప్రజానీకం, అనగా నూటికి తొంభై మంది విష్ణు ఆలయానికి వెళ్లినా, శివాలయానికి వెళ్లినా, ఏ అమ్మగుడికి వెళ్లినా, పవిత్ర హృదయంతో, భక్తితో, సమాన ప్రతిపత్తితోనే మొక్కుతున్నారు. ఆరాధిస్తున్నారు. ఆ దేవతలను స్తుతిస్తున్నారు. నమ్ముతున్నారు, ఫలాన్ని పొందుతున్నారు. ఇది మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, మన సమాజము యొక్క ఉత్కృష్టత.
ఇటువంటి వైవిధ్యము, సమైక్యతలను ఏ సిద్ధాంతాలూ కూడా భంగం చేయలేకపోయాయి. వీటన్నిటినికి వెనుక ఉన్నటువంటి ఈ మహారహస్యము ఏమిటి? ఈ జగత్తును నడిపించే పరమేశ్వరుని యొక్క అస్తిత్వ మందు విశ్వాసము, దానిపై ఆధారపడి తన మనుగడను సాగించడము, ఆ పరతత్త్వానికి ఏ రూపమైనా ఉండవచ్చు. ఏ పేరైనా ఉండవచ్చు అన్న విషయాన్ని నిస్సందేహంగా అంగీకరిచడము- ఇవన్నీ వేదమతంలో పుట్టిన భారతీయులకు సామాన్య లక్షణాలు. ఎందుకంటే, వేదం ఏ ఒక్క దేవతామతము కాదు. అందువల్ల సార్వజనీనము, సార్వకాలికము అయినదని గుర్తించవలెను.

Comments
Post a Comment