400..ఆ రోజు ఎంతో దూరంలో లేదు

వన్డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లు 400 కూడా బాదేస్తారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నాడు భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి కపిల్‌ దేవ్‌. ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ క్రికెట్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 'ప్రస్తుతం క్రికెటర్ల మైండ్‌సెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. 35 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసేస్తున్నారు. మా రోజుల్లో ఇది సాధ్యం కాలేదు. మన భారత క్రికెట్‌లోని నాణ్యత ఏమిటో ఫలితాల బట్టే తెలుస్తోంది' అని అన్నాడు. అనంతరం వన్డేల్లో త్రిశతకాలు సాధించడంపై అడిగిన ప్రశ్నకు 'త్రిశతకాలే ఎందుకు, త్వరలో ఏదో ఒక దేశానికి చెందిన బ్యాట్స్‌మెన్‌ వన్డే క్రికెట్‌లో 400 బాదేస్తారు చూడండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆటగాళ్లు తమ గేర్లు మార్చుకుంటున్నారు. 1980ల్లో రోజంతా ఆడినా 280 పరుగులు సాధించడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు 20 ఓవర్లలోనే 280కి పైగా పరుగులు చేసేస్తున్నా' అని బదులిచ్చాడు. అనంతరం కోహ్లీ-సచిన్‌ మధ్య పోలిక గురించి మాట్లాడుతూ..'ఈ ఇద్దరి ఆటగాళ్లను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ఎవరికి వారే గొప్ప. ఎప్పుడైనా ఎవరైనా బాగా ఆడితేనే జట్టు విజయాలు సాధ్యమవుతాయి. అప్పుడే మన క్రీడలోనూ అభివృద్ధి జరుగుతుంది' అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.

Comments