వేశ్య కూతురు చదువుల తల్లి

భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తికి తనదైన జీవితం ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఎవరి జీవితం వారిది. వారు ఎలాంటి స్థితుల్లో, ఎలాంటి ప్రదేశంలో జన్మించినా సరే, ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తాను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తన జీవితాన్ని తాను నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అంతే కానీ ఒకరు మారిస్తే మారేది కాదు. సరిగ్గా ఇలా ఆలోచించింది కాబట్టే ఆ యువతి తాను పుట్టిన ప్రదేశం, తల్లి, ఇతర విషయాలను అన్నింటినీ మరిచిపోయింది. తన జీవితాన్ని తాను మలచుకుంది. ఇప్పుడు తాను అనుకున్నట్టు జీవిస్తోంది. ఆమే.. అశ్విని..! 
అశ్విని నిజానికి ఓ సెక్స్‌ వర్కర్‌కు జన్మించింది. తల్లితోపాటే వేశ్యాగృహాల్లో పెరిగింది. కానీ ఆమెది చాలా చిన్న వయస్సు కదా. ఏమవుతుందో తెలియదు. దీనికి తోడు తల్లి అప్పుడప్పుడు హింసించేది. అయితే ఆ తల్లి అనుకోకుండా చనిపోవడంతో అశ్విని దిక్కులేనిదైంది. ఈ క్రమంలో ఓ ఎన్‌జీవో ఆమెను ఆదరించింది. అయితే అక్కడ కూడా ఆమెను ఎన్‌జీవో నిర్వాహకులు ఇబ్బందులు పెట్టేవారు. అప్పుడామెకు 8 ఏళ్లు. అలా 2 ఏళ్ల పాటు ఆ ఎన్‌జీవోలో ఉన్నాక 10 ఏళ్ల వయస్సులో క్రాంతి అనే మరో ఎన్‌జీవో సంస్థలో చేరింది. 
అయితే క్రాంతిలో చేరాక అశ్విని తన విషయాలను పూర్తిగా మరిచిపోయింది. తాను పుట్టిన ప్రదేశం, తల్లి, ఇతర విషయాలను అస్సలు గుర్తుంచుకోలేదు. అంతలా క్రాంతి అశ్వినిని ఆదరించింది. ఈ క్రమంలోనే క్రాంతి సంస్థలో అనేక సంవత్సరాల పాటు అశ్విని ఉంది. అక్కడే అన్ని విషయాలను ఆమె నేర్చుకుంది. ముఖ్యంగా కళలు, డ్యాన్స్‌ వంటివి ఆమె నేర్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌జీవో తరఫున ఆమెకు పనిచేసే అవకాశం వచ్చింది. అలా అశ్విని ఎన్‌జీవోలో సామాజిక సేవ చేస్తూ వస్తోంది. ఓ క్యాన్సర్‌ హాస్పిటల్‌లో చిన్నారులకు అనేక విషయాలను నేర్పించింది. వారు తమ భావాలను సరిగ్గా ప్రదర్శించేలా వారికి ఆమె కళల ద్వారా శిక్షణనిచ్చింది. అనంతరం పశ్చిమబెంగాల్‌లో థియేటర్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఫొటోగ్రఫీ అభ్యసించింది. ఆ తరువాత ఢిల్లీలో దళితుల అభివృద్ధి కోసం పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం అప్లై చేసింది. త్వరలో అమెరికా కూడా వెళ్లనుంది. అవును, సెక్స్‌ వర్కర్‌కు జన్మించినా, అశ్విని తన గత జీవితం గురించి మరిచిపోయింది. కేవలం తన భవిష్యత్తు కోసమే కష్టపడింది. ఆ దిశగా పనిచేసింది. తన జీవితాన్ని అందంగా నిర్మించుకుంది. ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. అందుకు ఆమెను మనం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే..!

Comments