ఎంత దౌర్భాగ్యం

 రైతుల స్ఫూర్తిదాయక విజయానికి 
తెలుగు మీడియాలో దక్కని ప్రాధాన్యం
ఎక్కడా విధంసం సృష్టించలేదు. యుద్ధాలూ చేయలేదు..మనుషులకు..పక్షులకు ఎటువంటి హానీ తలపెట్టలేదు. మహా సంకల్పంతో పాదయాత్ర మాత్రమే చేశారు. రైతన్నలంటే ఏంటో చూపించారు. అన్నం పెట్టేవాడికి ఆకలి బాధ తెలుసన్నట్టు ఎంత స్ఫూర్తిగా వ్యవహరించారో. కాళ్లు పగిలి రక్తం కారుతున్నా లక్ష్యం వదిలిపెట్టలేదు. ఆ మనోధైర్యమే వారిని గెలిపించింది. ప్రభుత్వ మెడల్ని వంచింది. 
అన్నం పెట్టే రైతుకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. మౌనం కూడా ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసి వచ్చింది. అసలే బక్కచిక్కిన ప్రాణాలు అయినా సత్తువంతా కూడదీసుకున్నారు. మండుటెండలో 180 కిలోమీటర్ల నడక, చెప్పులు తెగిపోయాయి, కాల్లు పుండ్లు పడ్డాయి, తిండితప్పలన్నీ రోడ్డుపైనే. పుణె నుంచి ముంబై వరకు ఎత్తినా జెండా దించకుండా మహాపాదయాత్ర చేశారు. రైతన్నే కదిలొచ్చి దండయాత్ర చేసే సరికి ప్రభుత్వం భేషజాలకు పోకుండా వాళ్ల దగ్గరకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ దేశంలో రైతులు విజయం సాధించారు. పోరాటానికి కొత్త అర్థం చెప్పారు. దాదాపు 50 వేల మంది రైతులు పాదయాత్ర చేసుకుంటూ ప్రభుత్వంపై దండయాత్రకు వచ్చేసరికి అసెంబ్లీ ముట్టడికి ముందే సర్కార్‌ స్పందించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలించాయి. రుణమాఫీతో పాటు రైతులు ప్రస్తావించిన ప్రతీ సమస్యను కాలపరిమితితో పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు కూడా శాంతించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆజాద్‌ మైదాన్‌ నుంచి మరో ఉద్యమం ప్రారంభమవుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. శాంతి యుతంగా పాదయాత్ర చేసి అనుకున్నది సాధించారంటూ మహారాష్ట్ర రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. పాదయాత్రతో తరలివచ్చిన రైతాంగానికి ముంబై ప్రజలు అండగా నిలిచారు. రైతులు క్షేమంగా ఇళ్లు చేరేందుకు ప్రభుత్వం వాహన సదుపాయాలు కూడా కలిపించింది. సోషల్‌ మీడియాలోనూ బక్క రైతు పోరాటానికి అనూహ్యమైన మద్దతు లభించింది. వారి పోరాటం ఎందరిలోనో స్ఫూర్తి నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
అయితే తెలుగు మీడియా ప్రవర్తన బాధకలిగించింది. దేశంలో రైతు సమస్యలపై తెగ వ్యాసాలు రాసే తెలుగు మీడియాలో మాత్రం ఆ అన్నంపెట్టే పేదవాడి సమస్య పట్టలేదు. ఇంగ్లిషు పత్రికలు రైతుల స్ఫూర్తిదాయక విజయాన్ని పతాక శీర్షికన ప్రచురించాయి. తెలుగు మీడియా మాత్రం వారి అజెండాకే పెద్దపీట వేశాయి. రైతన్నల సమస్య కనీసం మొదటిపేజీలో సింగిల్‌ కాలమ్‌కు నోచుకోకపోవడం తెలుగు పత్రికల దిగజారుడు తనానికి పరాకాష్ట. ఇటీవల మృతి చెందిన శ్రీదేవి వార్తను 24 గంటలపాటు ఉన్నవి..లేనివీ వండివార్చి రోత పుట్టించిన ఛానల్స్‌ రైతుల పోరాటం ప్రాధాన్యత ఇవ్వకపోవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. చివరికి శ్రీదేవి బాత్రూం టబ్‌ పడిపోయిన ఎపిసోడ్‌ను కూడా కళ్లకు కట్టినట్టు చూపించిన చానల్స్‌...రైతులను పట్టించుకోకపోవడం విచారకరం. ప్రపంచ ఎకనమిక్‌ ఫోరం తాజాగా నిర్వహించిన సర్వేలో భారత దేశంలో మీడియా పరిస్థితి అధ్వానంగా ఉందని తేలింది. టీఆర్‌పీ కోసం అసత్య వార్తలను ప్రసారం చేస్తోందని మండిపడింది.యజమానులు కొన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి వారికి కొమ్ము కాస్తున్నారని పేర్కొంది.

Comments