వర్మ మదిలో.. శ్రీదేవి బయోపిక్‌

భువి నుంచి దివికేగిన అతిలోక సుందరి స్వర్గంలో చెలికత్తెలతో విహరిస్తున్న వైనం అభిమానుల కళ్లకు గోచరిస్తోంది. పోగొట్టుకున్న అంగుళీకం దొరక్కపోయి ఉంటే బావుండేదని దేవేంద్రుని గారాల తనయ శ్రీదేవి తిరిగి వెనక్కి వెళ్లకపోయి ఉంటేనే బావుండేదని అభిమానులు ఎంతగా కోరుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. దుబాయ్‌ ¬టల్‌ బాత్‌ టబ్‌ రహస్యం ఎప్పటికీ ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లాంటిదేనని ఇప్పటికీ అభిమానులు నమ్ముతున్నారు. ఇలాంటి వేళ ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. శ్రీదేవి జీవితంలోని ఎమోషన్‌ వెండితెరకెక్కించేందుకు ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారన్నది ఆ చర్చ సారాంశం. ఇప్పటికిప్పుడు అతిలోక సుందరి బయోపిక్‌ గురించి ప్రకటించడం సబబు కాదని భావించిన ఆర్జీవీ అలియాస్‌ రామ్‌గోపాల్‌ వర్మ సైలెంటుగా ఉన్నారు. సాధ్యమైనంత తొందర్లోనే శ్రీదేవిపై బయోపిక్‌ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని వర్మ వీరాభిమాని, శిష్యుడు కం లిరిసిస్ట్‌ సిరాశ్రీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీదేవి బయోపిక్‌ తెరకెక్కించేందుకు వర్మ ఆసక్తిగా ఉన్నారు. బయోపిక్‌ కథ రెడీ అవ్వగానే సినిమాని ప్రకటిస్తారని వెల్లడించారు. బంధుమిత్రుల్ని నమ్మిన తండ్రి వల్ల ఆస్తులన్నీ కోల్పోయిన శ్రీదేవి, అటుపై తన తల్లి ఓవర్‌ప్రొటెక్టివ్‌ నేచుర్‌ వల్ల పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయి బంధిఖానాలో బతికే పక్షి అయిపోయిందని శ్రీదేవి అభిమానులకు రాసుకున్న ప్రేమఖలో వర్మ వెల్లడించారు. లిటిగేషన్‌ ఉన్న ఆస్తులపై పెట్టుబడులు పెట్టి చివరికి చేతిలో చిల్లి గవ్వ లేని సన్నివేశానికి శ్రీదేవి వచ్చేసింది. శ్రీదేవి తల్లి చేసిన కొన్ని తప్పిదాలు అప్పుల పాల్జేశాయని వెల్లడించారు. దేశంలోనే బ్లాక్‌లో పారితోషికం అందుకున్న మేటి కథానాయిక జీవితం ఒకానొక దశలో ఎంతో క్లిష్ట పరిస్థితికి చేరుకుందని, ఆ క్రమంలోనే బోనీకపూర్‌తో రెండో పెళ్లి, అటుపై బోనీ మొదటి భార్య కుటుంబంతో వైరం.. తదితర విషయాల్ని ప్రస్థావించారు. వెండితెరకు కావాల్సిన అన్ని ఎమోషన్స్‌, కమర్షియల్‌ హంగులు ఉన్న గ్రేట్‌ స్టోరి లెజెండ్‌ శ్రీదేవిది. ఇక తన గురించి అన్నీ తెలిసిన వర్మ బయోపిక్‌ తీయకుండా ఉంటారా?

Comments