ఆశల వెలుగుకు స్వాగతం

నిన్నటిదాకా మన వెంట వచ్చిన నేస్తం ఇక సెలవంటూ తెరచాటుకు తప్పుకుంది. ఏడాదంతా చేయి పట్టుకు న డిచిన చెలి వీడ్కోలు చెబుతూ కాలం పరదాల మాటున మాయమైంది. ఎన్నో అనుభూతులను, అనుభవాలను పంచి ఇచ్చిన మరో సంవత్సరం బతుకు ప్లాట్‌ఫాంపైనుంచి తరలి వెళ్లింది. నెలలు రోజులై, రోజులు గంటలై, గంటలు నిమిషాలు.. క్షణాలై.. ఓ ఏడాది మన గుప్పెట్లోనుంచి జారి అదృశ్యమై అంతర్థానమైంది. అనంత కాల ప్రవాహంలో పూల పడవలా తరలివెళ్లింది. అయితేనేం.. కాలం జీవనది. అది ఎక్కడా అగనిది. అందుకే ఆ రైలు అలా వెళ్లిందో లేదో.. ఈ పడవ అలా మళ్లిందో లేదో.. మరింత అందంగా.. మరింత నవ్యంగా.. ఇంకాస్త వయ్యారంగా.. కొత్త సంవత్సరం రానే వచ్చింది. తన గుప్పెట్లో ఎన్ని రహస్యాలు దాచుకొచ్చిందో.. తన గుండెల్లో ఎన్ని ఊసులు మోసుకొచ్చిందో..  నిన్నూ నన్నూ నవ్వుతూ పలకరిస్తోంది. నిన్నటి చీకటి నేటి వెలుగుకు నాంది పలికింది. రాత్రి వెంట పగలు రావడం ప్రకృతి ధర్మమని.. కమ్ముకున్న చీకటి కొత్త వెలుగుకు నాంది పలుకుతుందని ఉత్సాహంగా చాటి చెబుతోంది. అర్థరాత్రి..  గడియారంలో రెండు ముళ్లు చేతులు కలుపుకొన్న  వేళ.. ప్రభవించిన ఈ నూతన వత్సరం వెలుగుల వెల్లువలా దర్శనమిస్తోంది. రాబోయే 365 రోజులూ నీకూనాకూ అండగా నిలిచి ఉంటానని మాట ఇస్తోంది. ఆనందలోకాల దిశగా అడుగేయమని స్వాగతిస్తోంది. ప్రయాణమన్నాక మలుపులు సహజం. బతుకన్నాక అనుభూతులు అనివార్యం. వెలుగులూ, చీకట్లూ కలిస్తేనే కదా అది జీవితం. నవ్వులున్నాయని ఒకే రోజులో ఆగిపోలేం.. కష్టాలొచ్చాయని కాలానికి దూరం కాలేం. అందుకే పద నేస్తం. ఈ అద్భుత ప్రవాహంలో ముందుకు సాగిపోదాం. ఆనందామృత వర్షిణి పలకరిస్తుందన్న ఆశతో అడుగు ముందుకేద్దాం. ఈ కొత్త వెలుగు ఏడాదంతా ఇలా పులకరింపజే స్తుందన్న విశ్వాసంతో వినూత్న సంవత్సరానికి వేడుకగా స్వాగతం చెబుదాం. వెల్‌కం న్యూ ఇయర్‌.. హ్యాపీ 2018.

Comments